హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్ ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన ఏసీబీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ శివధర్‌రెడ్డి అభినందించారు. ఏసీబీ డీజీ చారుసిన్హాతోపాటు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. బుధవారం డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతిపరులైన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించొద్దని ఏసీబీకి సూచించారు. లంచం తీసుకున్న టేక్మల్ ఎస్సైని ఏసీబీ అరెస్టు చేసిన అనంతరం స్థానికులు సంబరాలు చేసుకున్న ఘటనపై పోలీసు అధికారులు, సిబ్బంది తమ పనితీరుపై స్వీయ సమీక్ష చేసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలు పటాకులు కాల్చి బహిరంగంగా సంబురాలు జరుపుకున్న ఈ ఘటన ప్రజల నుంచి ఒక బలమైన సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడ్డారు. పోలీసుల పట్ల ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని వాపోయారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే పర్యవేక్షణ చేసే అధికారుల లోపంగానే భావిస్తామని, వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.