హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తమకు న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర పోలీసుశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం శనివారం ఓ నోట్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధి విధానాలు అమలు జరిగినట్లుగానే తెలంగాణలోనూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుందని, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా వారికి సరెండర్ లీవులు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో పోలీస్ సిబ్బందికి చెల్లించే వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలు చేపట్టడం సమంజసం కాదని, యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణతో విధులను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను ద్విగుణీకృతం చేయాల్సిన సిబ్బంది.. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదని కోరారు. టీజీపీఎస్పీ సిబ్బంది యథావిధిగా తమ సాధారణ విధులను నిర్వహించాలని, సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న ‘దర్బార్’ కార్యక్రమం ద్వారా వారి అధికారులకు/కమాండెంట్లకు/అడిషనల్ డీజీపీకి తెలపాలని సూచించారు. లేకపోతే వారి ఆందోళన కార్యక్రమాలను తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీస్ ఫోర్స్ యాక్ట్, పోలీసు యాక్ట్, పోలీసు మాన్యువల్ ప్రకారం చట్టపరమైన, పరిపాలనాపరమైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.