హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పోలీస్‌శాఖలో పారదర్శక పాలనకు సంస్కరణలు అవసరమని, వీటితో పోలీస్‌శాఖ సామర్థ్యం మరింత పెంపొందుతుందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎఫ్)తో రాష్ట్ర పోలీస్‌శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ చేపట్టిన మీ సేవ, పోలీస్స్టేషన్లలో క్యూఆర్ కోడ్ వ్యవస్థ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మహిళల కోసం టీ-సేఫ్ యాప్ వంటి కార్యక్రమాలకు ఈ ఎంఓయూతో మరింత విలువ చేకూరిందని పేర్కొన్నారు.
ఐపీఎఫ్ అధ్యక్షుడు ఓంప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పరిశోధన, విధాన రూపకల్పనల ద్వారా పోలీసింగ్‌లో మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఐపీఎఫ్ విభాగాలు ఏర్పాటయ్యాయని, ఇప్పుడు తెలంగాణలోనూ విస్తరించనున్నట్టు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభదశలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 పోలీస్స్టేషన్లు, సంగారెడ్డి జిల్లా పరిధిలో 15 పోలీస్స్టేషన్లలో అమలుచేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీజీ అభిలాష భిష్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్, ఐపీఎఫ్ కార్యవర్గ సభ్యుడు దుర్గాప్రసాద్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, అనిల్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఐజీలు తదితరులు పాల్గొన్నారు.