హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై చర్యలు తీసుకుంటామని, ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, గాంధీ వివాదంపై స్పందిస్తూ ఇప్పటికే గాంధీ, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ జరుగుతున్నందున తెలంగాణలోకి మావోయిస్టులు వస్తే.. తమ భద్రతా దళాల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని, అవసరమైతే ఎన్కౌంటర్లకూ వెనుకాడబోమని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మినహా తెలంగాణలో మావోయిస్టుల కదలికలు లేవని చెప్పారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల జాడ లేదని తెలిపారు. ఉగ్ర కదలికలపై నిఘా ఉంచామని, సమాచారం ఉంటే తెలియజేస్తామని చెప్పారు. వినాయక నిమజ్జనాల్లో డీజే సిస్టమ్స్ ఉపయోగించొద్దని, వాటివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని సూచించారు. చిన్న చిన్న ఘటనలు మినహా వినాయక చవితి, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. మొత్తం 5,879 ప్రాంతాల్లో 1,36,638 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,400 మంది పోలీసులు, 47 ప్లాటూన్స్‌తో విధులు నిర్వర్తించినట్టు చెప్పారు.
జైనూర్ ఘటన దురదృష్టకరం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జైనూర్ ఘటన దురదృష్టకరమని డీజీపీ అన్నారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసి, 38 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 720 మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో జైనూర్ మొత్తం మోహరించామని వివరించారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీ, ఐజీతో భద్రతను పర్యవేక్షించామని తెలిపారు. సివిల్ కేసుల్లో తలదూర్చిన చిక్కడపల్లి ఏసీపీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుందని సీబీఐ, ఇంటర్‌పోల్ సహకారంతో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. డప్పు కొట్టకపోతే గ్రామ బహిష్కరణ చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, ఆ వెలివేతకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏడీజీ మహేశ్ భగవత్, ఐజీలు సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్ ఉన్నారు.