Tourist Police | తెలంగాణలో కొత్తగా పర్యాటకుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తీసుకురానున్నట్లు డీజీపీ జితేందర్ ప్రకటించనున్నారు. తెలంగాణ టూరిజంశాఖ, పోలీస్శాఖల మధ్య సమన్వయ సమావేశం బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్, టూరిజం శాఖ ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సీహెచ్ ప్రియాంక, ఇతర పోలీసు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తొలి దశలో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీసు సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 27న జరగనున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ తదితర ప్రాంతాలలో టూరిస్ట్ పోలీసులు పని చేస్తారని అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందేందుకు పోలీస్ శాఖ పర్యాటకశాఖకు పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. షూటింగ్ పర్మిషన్లు కోసం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలను రూపొందించాలని డీజీపీ సూచించారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు భద్రత కల్పించడం పోలీస్ సిబ్బందికి సులభం అవుతుందన్నారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం సినీ నిర్మాతలు ముందస్తుగా తెలియజేస్తే కార్యక్రమాలకు భద్రత కల్పించే సమయం దొరుకుతుందన్నారు.
సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టనునట్లు తెలిపారు. విదేశీ టూరిస్టులతో పాటు పాటు దేశంలో ఉన్న టూరిస్టులు విస్తృతంగా పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని వారికి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసు అవసరం ఉందని తెలిపారు. ఆధ్యాత్మిక, మెడికల్, వినోదాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే వారి భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను కేటాయించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, మల్టీ జోన్ 2 ఐజీపీ తఫ్సీర్ ఇక్బాల్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్, రాచకొండ డీసీపీ ఇందిర, ఏఐజీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.