హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న సిట్‌కు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ అనిల్‌కుమార్ లిఖితపూర్వకంగా తమ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఇటీవల సిట్ విచారణ ఎదుర్కొన్న ప్రభాకర్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు.. అప్పటి హోమ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏడీజీ అనిల్‌కుమార్ సిట్ లేవనెత్తిన సందేహాలను తమ సమాధానంలో నివృత్తి చేసినట్టు సమాచారం.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి రివ్యూ కమిటీలో డీజీపీ జితేందర్, ఏడీజీ అనిల్‌కుమార్ కీలక సభ్యులుగా ఉన్నారు. ఇదే కేసులో నాడు డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డి, సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ సైతం సిట్ విచారణను ఎదుర్కోనున్నట్టు తెలిసింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌రావు బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు.