హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి ఎన్నిక పోలీసులకు ఓ కొత్త సవాలేనని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మరో ఐదారు నెలల్లో జరగనున్న ఎన్నికలకు పరిపాలనా పరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పోలీసులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ధిక్కరించకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికలకు పరిశీలకులుగా వెళ్లి వచ్చిన అడిషనల్ డీజీ సౌమ్యా మిశ్రా, డీసీపీ అభిషేక్ మొహంతి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్‌కుమార్ అకడి అనుభవాలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా మేజర్ జనరల్ రాకేశ్ మనోచ సోమవారం డీజీపీ అంజనీ కుమార్‌తో సమావేశమై ఇరు శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.