హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్ శాఖలో సాంకేతికత, ఏఐని పరిధి మేరకు ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొద్దామని, ఇందుకు అంతా కృషి చేయాలని నూతన డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. సాంకేతికత వినియోగంలో ఏఐ టూల్స్, డ్రోన్ల వినియోగాన్ని పెంచుతామని పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయానికి కుటుంబ సమేతంగా హాజరైన ఆయన.. డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు పోలీసుల ప్రాథమిక విధులే అయినా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. సాంకేతికత వినియోగంలో భాగంగా ఏఐ టూల్స్, డ్రోన్ల వినియోగాన్ని పెంచుతామని, ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ కోసం గూగుల్ తదితర సంస్థల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. విపత్తు సమయాల్లో హైడ్రా, ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి ఫస్ట్ రెస్పాండర్‌గా పనిచేసేలా సిబ్బందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. నేటి తరం సైబర్ నేరాలు, డ్రగ్స్ ముప్పును ఎదురొంటున్నదని, విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు, డ్రైవ్‌లు చేపట్టి యువతను ఈ మహమ్మారి నుంచి వారిని కాపాడుతామని డీజీపీ స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆనంద్ నిర్ణయించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్‌ను దారిలోకి తెచ్చేందుకు, వేల సంఖ్యలో నమోదవుతున్న రోడ్డు ప్రమాద మరణాలకు ఈ బ్యూరో ద్వారా చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. దొంగతనాలు, ఆహార కల్తీ, రియల్ ఎస్టేట్ మోసాలు, బెట్టింగ్, స్మగ్లింగ్‌పై ఉకుపాదం మోపుతామని హెచ్చరించారు. శాఖ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ గతంలో నక్సల్స్ నియంత్రణ కోసం పనిచేసిన గ్రే హౌండ్స్, ఎస్ఐబీ విభాగాల సిబ్బందిని సైబర్, నారోటిక్స్, ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందులో ఇప్పటికే 5 వేల నియామకాలకు ఆమోదం లభించిందని డీజీపీ ఆనంద్ వెల్లడించారు.
పోలీసులు అవినీతికి దూరంగా ఉండాలని డీజీపీ ఆనంద్ హెచ్చరించారు. అవినీతిని అరికట్టాల్సిన వారే.. దానిని ప్రోత్సహిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు అధికారుల్లో సమన్వయ లోపం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, అంతా సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థీకృత నేరంగా మారిందని, దానిని అరికట్టడంతో, సైబర్ నేరాలు అరికట్టడంలో ఎస్పీలు, సీపీలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకు పోయిందని, మిగిలివారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలువాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశలో ఉందని, త్వరలోనే సమీక్షించి దానికి అనుగుణంగా చార్జిషీట్ వేస్తామని తెలిపారు. తాను మెక్రో మేనేజ్ మెంట్ విధానాన్ని అనుసరిస్తానని, క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్ మీటింగ్స్ ద్వారా వారి పనితీరును పర్యవేక్షిస్తానని డీజీపీ స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు ట్వీట్లు చేసినా, రీ ట్వీట్లు చేసినా, సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని, ‘నల్ల బాలు వర్సెస్ తెలంగాణ స్టేట్’ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసినా తెలంగాణ అమలు చేయడం లేదని, పక్కనున్న కర్ణాటక అమలు చేస్తున్నదని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రశ్నించగా డీజీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామని డీజీపీ అన్నారు. తెలంగాణలోనూ నల్ల బాలు కేసులో సుప్రీం విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో శాంతి భద్రతల డీజీ మహేశ్ ఎం.భగవత్, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతీ లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సీఐడీ డీజీ చారు సిన్హా, గ్రేహౌండ్స్ డీజీ అనిల్ కుమార్, సైబరాబాద్ సీపీ రమేశ్, రైల్వేస్ ఐజీ రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.