హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, వీటి బారిన పడి నిత్యం దేశవ్యాప్తంగా ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్నారని డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన లేమి ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫ్రాడ్ కా పుల్‌స్టాప్’ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
మొదటి వారం సైబర్ సారథి, గోల్డెన్ అవర్‌పై, రెండోవారం డిజిటల్ అరెస్టులపై, మూడో వారం ఇన్వెస్ట్మెంట్ మోసాలు, లోన్ యాప్స్, ఫేక్ రివార్డ్స్‌పై నాలుగో వారం హ్యాకింగ్, ఫేక్యాప్స్, రాన్సమ్వేర్పై, ఐదోవారం ఐడెంటిటీ థెఫ్ట్, ఓటీపీ మోసాలపై, ఆరోవారం ఆన్లైన్లో మహిళలు, పిల్లలకు ఎదురయ్యే ముప్పులపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. విద్యార్థుల కోసం ‘స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పేస్’ (స్పార్క్) కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
ఈ సందర్భంగా ‘స్పార్క్’ లోగోను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగినప్పటికీ తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని, ఇప్పటివరకు బాధితులకు దాదాపు రూ.350 కోట్లు రిఫండ్ చేశామని సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. కార్యక్రమంలో డీజీ అభిలాష బిస్త్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, సీపీలు సజ్జనార్, అవినాశ్ మహంతి తదితరులు పాల్గొన్నారు.