హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): విద్య, ఉపాధి అవకాశాల పేరిట విద్యార్థులు, నిరుద్యోగులను అక్రమంగా విదేశాలకు పంపే ఏజెన్సీలపై కఠిన చర్యలు చేపడతామని డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. ‘విదేశాలకు వెళ్లే వలస కార్మికులు, ఉద్యోగుల భద్రత, క్రమబద్ధీకరణ-పోలీస్ శాఖ చేపట్టాల్సిన చర్యలు’ అంశంపై శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల్లో చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారని డీజీపీ తెలిపారు.
ఈ నేపథ్యంలో గుర్తింపులేని విదేశీ నియామక సంస్థ లు, పర్యాటక ఏజెన్సీలపై నిఘా పెట్టినట్టు చెప్పారు. 1983 ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి ఔసాఫ్ సయీద్ వెల్లడించారు. తెలంగాణలో పాస్పో ర్ట్ వెరిఫికేషన్ చాలావేగంగా జరుగుతున్నదని అభినందించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమం లో ఇమ్మిగ్రెంట్స్ ప్రొటెక్టర్ జనరల్ జాయింట్ సెక్రటరీ బ్రహ్మకుమార్, అండర్ సెక్రటరీ సుధీర్‌కుమార్ మీనా, అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ డీఎస్‌చౌహాన్, తెలంగాణా టాంకాం సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.