హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న సాంకేతికత చాలా విషయాల్లో ప్రమాదకరంగా మారుతున్నదని, ప్రజలు సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్స్‌కు డార్క్‌వెబ్ అడ్డాగా మారిందని, వారే సోషల్ మీడియాను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ వేణుగోపాల్ మెమోరియల్ ఫోర్త్ టాక్‌లో భాగంగా ‘చాలెంజెస్ బిఫోర్ పోలీస్ అండ్ పోలీస్ లీడర్షిప్’ అంశంపై డీజీపీ మాట్లాడారు.
సాంకేతికత ఆధారంగా జరుగుతున్న నేరాలతో నేరాల అర్థం మారిపోయిందని అన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు కష్టపడుతున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తులు సాంకేతికతను వినియోగించి దాడులు ఎలా చేయాలో అని ఆలోచిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నదని ప్రశంసించారు.