హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ 9వ ఓపెన్ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పోలీస్ బృందం సత్తా చాటింది. ఈ సందర్భంగా పతకదారులను డీజీపీ అంజనీకుమార్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. షూటింగ్ ఈవెంట్లలో సైతం పోలీసులు విజేతలుగా నిలవడం పోలీస్‌శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. గతవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన చాంపియన్ షిప్లో రాచకొండ ఐటీ అండ్ సీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్ 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.
హైదరాబాద్ కమిషనరేట్ సీఎస్‌డబ్ల్యూ విభాగానికి చెందిన సీఐ బీ శంకర్ 25మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని గెలుపొందారు. జగిత్యాలకు చెందిన ఆర్ఐ (డీఏఆర్) జీ సైదులు 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. కామారెడ్డికి చెందిన కానిస్టేబుల్ (డీఏఆర్) కే రాజ్‌కుమార్ 50మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించారు.
మంచిర్యాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ (13వ బెటాలియన్) పీ శ్రీనివాస్ 25మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో రజత పతకం, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ బీ స్రవంతి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించారు. నిజామాబాద్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ (సీఏఆర్) సిహెచ్.మాధవి 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని గెలుపొందారు. కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ఇ రాజ్‌కుమార్ 50మీటర్ల 3పీ ఈవెంట్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏడీజీలు అభిలాష బిస్త్, మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్, ఐజీలు షానావాజ్ ఖాసీం, కమలాసన్‌రెడ్డి, తరుణ్‌జోషి, రమేశ్‌రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.