యాదాద్రి భువనగిరి/యాదగిరిగుట్ట, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎటు చూసినా కృష్ణశిల కళా ఖండాలు.. ఆలయమంతా అబ్బురపరిచే శిల్ప కళా సం పద.. అనంత కోటి స్వర్ణ కాంతులు.. అడుగడుగునా ఉట్టిపడే ఆధ్యాత్మిక ఝరి.. భక్తుల తన్మయత్వం.. భువిపై వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం. మాజీ సీఎం కేసీఆర్ కలల, సంకల్ప ఆలయం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. భక్తుల కొంగు బంగారమైన నృసింహ క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. రికార్డు స్థాయిలో రోజు ఆదాయం కోటి రూపాయలు దాటుతుండగా పండుగల సమయాల్లో లక్ష మందికి పైగా భక్త జనం స్వామివారి సేవలో తరిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరాదరణకు గురైన యాదగిరిగుట్ట ఆలయంపై స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్న నేపథ్యంలో సుమారు 1,300 కోట్లతో అత్యద్భుతంగా పునర్నిర్మించారు. తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా నిలిచేలా తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత నియమనిబద్ధతలతో ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత దేవస్థానం రూపురేఖలే మారిపోయాయి.
సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆధునికతను జోడించి వెయ్యేండ్ల వరకు చెకుచెదరకుండా ఆలయాన్ని పునర్మించారు. ప్రధానాలయం, కృష్ణశిలతో నిర్మించిన గోపురాలు, శిల్పాలు, శివాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, సప్తతల, పంచతల గోపురాలు, రథశాల, ఆకర్షణీయమైన క్యూకాంప్లెక్స్లు, యాగశాల, లక్ష్మీపుషరిణి, సత్యనారాయణస్వామి వ్రతమండపం, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, విష్ణు పుషరిణి, లక్ష్మీ పుషరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, టెంపుల్ సిటీ, నిత్యాన్నదాన సత్రం ప్రెసిడెన్షియల్ సూట్లు, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫె్లైఓవర్ల నిర్మాణం ఇలా అనేక నిర్మాణాలు విశేషంగా నిలిచాయి. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కేసీఆర్ చేతులమీదుగా ప్రధానాలయం పునఃప్రారంభమై భక్తుల కొంగుబంగారంగా అలరారుతున్నది. కేసీఆర్ శ్రీకారం చుట్టిన స్వర్ణ గోపురం తాపడం పనులు ఇటీవల పూర్తయ్యాయి.

ఆలయ పునరుద్ధరణ తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొందరు ఏడాదిలో నాలుగైదుసార్లు దర్శంచి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 10వేల మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 30 నుంచి 50 వేల మంది వరకు తరలివస్తున్నారు. ఇక పండుగల సమయాల్లో ముఖ్యమైన రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతున్నది. కార్తిక మాసంలో నిత్యం భక్తుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నది. ఈ నెల 16వ తేదీన ఆదివారం భక్తుల సంఖ్య ఏకంగా లక్ష దాటినట్టు అధికారులు చెప్తున్నారు. అదే రోజు తిరుమలలో 75వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు సమాచారం. అంటే ముఖ్యమైన రోజుల్లో యాదగిరిగుట్ట ఆలయానికి తరలివచ్చే భక్తుల సంఖ్య తిరుమలను దర్శనాల సంఖ్యను దాటుతున్నట్టు అంచనా.
స్వామి వారిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఆలయ నిత్య ఆదాయం కూడా భారీగా పెరుగుతూ వస్తున్నది. ఆలయం పునర్నిర్మాణం కంటే ముందు రోజుల్లో రోజుకు సగటున రూ.5 లక్షల వరకు ఆదాయం ఉండేది. ఇప్పుడది సగటున రూ.50 లక్షలకు పెరిగింది. శని, ఆదివారాల్లో రూ. 60 నుంచి రూ. 70 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నెల 16న రికార్డు స్థాయిలో రూ. 1.04 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే ఇది రెండో అత్యధికం. నిరుడు ఇదే కార్తీక మాసంలో నవంబర్19న రూ.1.16 కోట్ల ఆదాయంతో చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల నిలయంగా ఉన్న యాదగిరిగుట్ట క్షేత్రంలో కేసీఆర్ కృషితో భక్తులకు వసతులు మెరుగుపడ్డాయి. పాత ఆలయంలో కేవలం క్యూ కాంప్లెక్స్ రేకుల షెడ్డులో ఉండగా క్యూలైన్లు ఇరుకుగా భక్తులకు అసౌకర్యంగా ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వృద్ధులు, దివ్యాంగులు ఎసలేటర్ వినియోగించుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్ మొదటి అంతస్థు నుంచి చివరి అంతస్థు గల ప్రసాద విక్రయశాల వద్దకు మూడు ఎసలేటర్లు నిర్మించారు. భక్తులు చలి, వేసవితాకిడి తట్టుకునేలా ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానాలయంతో పాటు కొండచుట్టూ గల ప్రధాన కేంద్రాల వద్ద స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ముఖ మండపం, మూడు అంతస్థులతో పాటు క్యూ కాంప్లెక్స్‌లో ఏసీలు బిగించారు. వివిధ సేవలకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. కొండమీదికి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో భక్తులు అత్యంత సులభంగా స్వామి వారి దర్శనానికి రాగలుగుతున్నారు. రానున్న వందేండ్లను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో భక్తులకు వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించడంతోనే నేడు సకల సౌకర్యాల స్వామి వారీగా లక్ష్మీనర్సింహస్వామి విరాజిల్లుతున్నారనడంలో సందేహం లేదు.
నిత్యం వేలమంది భక్తులు తరలివస్తుండటంతో భువనగిరితో పాటు యాదగిరిగుట్ట ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఎంతో మందికి స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. రోజంతా చేతి నిండా పని దొరుకుతున్నది. ఇక హోటల్ వ్యాపారాలు కూడా భారీగా వృద్ధి చెందాయి. రోడ్డు పకన టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద హోటళ్లు సైతం ఇక్కడ ఏర్పాటయ్యాయి. గతంతో పోలిస్తే ప్రైవేటు లాడ్జీలు, వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై స్టార్ హోటళ్లు వెలిశాయి.
ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్తిక మాసంలో భక్తుల తాకిడితో పాటు ఆదాయం పెరుగుతూ వస్తున్నది. ఉద్ఘాటనకు ముందు 2021లో రూ. 7.35 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఆలయ పునఃప్రారంభం తర్వాత 2022 లో రూ. 14.66 కోట్లతో ఏకంగా రెండింతలు అయింది. 2024లో 14.30 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత కార్తిక మాసంలో మంగళవారం వరకు రికార్డు స్థాయిలో రూ. 16.31 కోట్ల ఆదాయంతో పాటు 11లక్షల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారు. ఈ నెల 20న కార్తిక మాసం ముగియనుండగా బుధ, గురువారాల్లో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవాలయానికి ధీటుగా యాదగిరిగుట్ట ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనడానికి అంతకంతకూ పెరుగుతున్న భక్తులతో పాటు ఒక్క రోజులోనే కోటి దాటుతున్న ఆదాయమే నిదర్శనంగా నిలుస్తున్నది. తిరుమలకు నిత్యం 60 నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటుండగా యాదాద్రిలో భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటున్నది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూలు, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపం, మెట్ల దారి కికిరిసిపోతున్నాయి. ప్రత్యేక రోజుల్లో స్వామివారి దర్శనానికి 5 గంటలకుపైగా, వీఐపీ టికెట్లకు 2 గంటలకు పైగా సమయం పడుతున్నది. శని, ఆదివారాల్లో రాత్రి ఆలయాన్ని మూసేసే వరకు క్యూలైన్లో భక్తులు వేచిచూస్తూనే ఉంటున్నారు. దీంతో ఆలయ ఘాట్ రోడ్డుపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. కొండపైన పారింగ్ స్థలం సరిపోవడంలేదు.

రోజూ భక్తుల రాక : 10 వేలు
రోజూ సగటు ఆదాయం : రూ.5 లక్షలు
రోజూ భక్తుల రాక : 30 -50 వేలు
శని, ఆదివారాల్లో : 60 – 80 వేల మంది
సగటున రోజుకు ఆదాయం : రూ.50 లక్షలు
శని, ఆదివారాల్లో : రూ.70 లక్షలు
ఈ నెల 16న రికార్డు స్థాయిలో ఆదాయం : రూ.1.04 కోట్లు
నిరుడు ఇదే కార్తిక మాసం నవంబర్19న : రూ.1.16 కోట్లు
ప్రస్తుత కార్తిక మాసంలో మొత్తం ఆదాయం : రూ.16.31 కోట్లు
కార్తిక మాసంలో నిర్వహించిన వ్రతాలు: 23,470