తాడ్వాయి, జనవరి 16 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతరను తలపించింది. వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు శుక్రవారం లక్షలాదిగా భక్తులు తరలిరాగా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం పూట గద్దెల వద్దకు భక్తులను అనుమతించిన పోలీసులు 10 గంటల సమయంలో రద్దీ పెరగడంతో గ్రిల్స్‌కు తాళాలు వేసి బయట నుంచే దర్శనం కలిగించారు. కల్యాణ మండపం వద్ద ఉన్న క్యూ ద్వారానే భక్తులను దర్శనానికి పంపించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్యూ ద్వారా వచ్చే భక్తులను గద్దెల వద్దకు వెళ్లకుండా గేట్లను మూసివేశారు. ప్రోటోకాల్ దర్శనాలని కొందరిని దర్జాగా గద్దెల వద్దకు అనుమతించగా, సామాన్య భక్తులు మాత్రం దర్శనానికి గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే 6 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.