వరంగల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ములుగు : ‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో నిండిపోయాయి. 15 కిలోమీటర్ల ప్రయాణానికి 17 గంటలు పట్టింది. 2004లో నెలకొన్న దుర్భర దృశ్యం మళ్లీ ఇన్నాళ్లకు భక్తులు కండ్ల చూశారు. అంతా తానై నడిపిస్తున్నానన్న మంత్రి సీతక్క సహా సర్వ వ్యవస్థలు నిశ్చలమైపోయాయి. ములుగు ఎస్పీ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో విఫలమయ్యారు.
కలెక్టర్‌కు అనుభవం లేకపోవడం, అన్ని విభాగాల పోలీసులు ఫొటోలు దిగడం, కుటుంబసభ్యుల దర్శనానికి ఎగబడటంవల్ల భక్తులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మంత్రి అడ్లూరి కాన్వాయిపై దాడి అనంతరమైనా జిల్లా యంత్రాంగం మేల్కొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల్లో నిమగ్నమైతే పరిస్థితి కొంతమేరకు అదుపులో ఉండేది. జాతరకు వీఐపీ, వీవీఐపీ పాసులు లేవంటూనే పెద్ద సంఖ్యలో ఫలారంలా పంచిపె ట్టారు. వీఐపీల తాకిడి పెరుగడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దర్శనం కౌంటర్లను రద్దు చేయడంతో వీఐపీలు సాధారణ క్యూలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేడారం అమ్మవార్ల సన్నిధిలో మంత్రివర్గ సమావేశాన్ని గత నెల 18న ఏర్పాటుచేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడంతో ప్రజల్లో జాతరకు భారీ ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నారనే అపోహలు ఏర్పడ్డాయి. ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టి 12సార్లు హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్ ద్వారా మంత్రులు పర్యటించి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించడంతో భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రి సీతక్కకే వారం రోజులుగా మేడారంలోనే బసచేసి, అధికారులలో జాతరను పర్యవేక్షించింది.

ప్రభుత్వం సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రులు స్వస్థలాలకు వెళ్లేందుకు టోల్ ఫీజును రద్దు చేసి, మేడారం భక్తులకు మాత్రం తోలు తీశారు. మేడారం రూట్లో ట్రాఫిక్ జామ్ సమస్యకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ టోల్ గేట్ కారణమైంది. జాతరకు ముందు ‘నమస్తే తెలంగాణ’ టోల్ గేటులో మేడారం భక్తులకు తలెత్తే ఇబ్బందులను కథనం ద్వారా హెచ్చరించినప్పటికీ అధికారులు టోల్ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోలేదు. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో నరకయాతన అనుభవించారు. తాగునీటి కోసం తండ్లాడారు. బస్‌స్టేషన్‌లో కూర్చునే అవకాశం లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు గంటల కొద్దీ నిల్చొని సొమ్మసిల్లి పడిపోయారు. తోపులాటలు, తొక్కిసలాటలు, సౌకర్యాల లేమితో ఆరుగురు భక్తులు చనిపోవడం దురదృష్టకరం. హైటెక్ హంగులు, ఏఐ నిఘా అంటూ గొప్పలు చెప్పుకొన్న ప్రభుత్వ యంత్రాంగం.. ట్రాఫిక్ నియంత్రణలో చేతులెత్తేసింది. వాహనాలు పస్రా నుంచి మేడారం చేరుకోవడానికి 14 గంటలు, తాడ్వాయి -మేడారం మధ్య 4 గంటలపాటు అడుగు కూడా కదలని దుస్థితి నెలకొంది. శుక్రవారం మేడారం నుంచి బయలుదేరిన భక్తులు శనివారం కూడా చేరుకోలేని పరిస్థితి.
మహాజాతరలో ఆపద సమయంలో భక్తులను వైద్యశాలలకు తరలించాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు ములుగు నుంచి మేడారానికి భక్తులను తరలిస్తూ వ్యాపారం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు చేరుకొని అక్కడి నుంచి అంబులెన్స్‌ల ద్వారా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకొని విధులు నిర్వర్తించారు. వైద్యుల కుటుంబాలు, వారి బంధువులను ములుగు డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులను 108 అంబులెన్స్ ద్వారా మేడారానికి తరలించి దర్శన భాగ్యం కల్పించారు.
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్‌పై దృష్టి సారించకపోవడంతో 30 కి.మీ. ప్రయాణానికి 7 గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.

హనుమకొండ చౌరస్తా, జనవరి 31 : మేడారం మహాజాతరలో భక్తుల తరలింపులో ఆర్టీసీ పూర్తిగా విఫలమైంది. హనుమకొండ, హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక భక్తులు ఇబ్బందులుపడ్డారు. కోపోద్రిక్తులైన ప్రయాణికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. 4 వేల బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ప్రకటించినా అమల్లో ఎక్కడా కనిపించలేదు. ఆర్టీసీ అధికారులు చేతులెత్తేయడంతో ప్రయాణికులు మేడారం బస్‌స్టాండ్‌లోకి చొచ్చుకెళ్లారు. బస్సులు రాకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ఎదురెళ్లి ఎక్కిన ఘటనలు ఉన్నాయి. వచ్చిన బస్సు వచ్చినట్టు నిండిపోవడంతో డోర్లు పెట్టుకోవడంతో డ్రైవర్‌కు, ప్రయాణికుల మధ్య గొడవలు జరిగాయి. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లాలని ప్రయాణికులు బస్సుల్లో సీట్లు లేకపోయినా కిందకూర్చొని వెళ్లడం గమనార్హం. మేడారం నుంచి హనుమకొండకు 12 గంటల సమయం పట్టిందంటే అతిశయోక్తికాదు.
ములుగు, జనవరి 31(నమస్తే తెలంగాణ) : మేడారం మహాజాతర జన దేవతల వనప్రవేశం రోజు ప్రభుత్వం చేసిన అరకొర ఏర్పాట్లతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు రోజులపాటు దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు సమర్పించారు. బుధవారం సారలమ్మ రాకతో మొదలైన మహాజాతర శనివారం సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరా జు, గోవిందరాజు వనప్రవేశంతో ముగిసింది. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కె ర కృష్ణయ్యతోపాటు వడ్డెలు సమ్మక్క గద్దె వద్ద పూజలు నిర్వహించి చిలుకలగుట్టకు సాగనంపారు. సారలమ్మ ప్రధా న వడ్డె కాక సారయ్య ఇతర వడ్డెలు గద్దెపైనుంచి తల్లిని కన్నెపల్లికి తీసుకెళ్లారు. పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజును కొండాయికి సాగనంపారు.