శ్రీశైలం : శ్రీశైలం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టనుంది. వేకువజామున పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
గంగాధర మండపం, ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్ లవన్న మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు 3 విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.