తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షేమం అనే ద్విముఖ వ్యూహంతో సాగింది. సాగునీటి విస్తరణతో వ్యవసాయానికి కొత్త ఊపు తీసుకురావడం, రైతుబంధు వంటి పథకాల ద్వారా రైతుల్లో ధైర్యం నింపింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలకు జీవం పోయడం వంటి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయి. ఇదే సమయంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ నగరీకరణకు దిశానిర్దేశం చేసింది. ఈ సమగ్ర దృక్పథం అభివృద్ధి కేంద్రిత రాజకీయాలకు ఒక ప్రమాణంగా నిలిచి, ప్రజా అభిమతాన్ని ఆకర్షించే శక్తిగా మారింది. కానీ అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది.
తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన టీ జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నలభై ఏండ్లపాటు కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా కొనసాగారు. తాజాగా పార్టీతో విభేదాలు, సొంత పార్టీ పాలనపై అసంతృప్తితో మార్చి 25న తన పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్లతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ చేతుల మీదుగా జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశం సాధారణ సమావేశంగా కాకుండా భావోద్వేగంతో నిండిన రాజకీయ సంకేతంగా మారింది. ‘అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయుమని దేవుడే పంపిండు’ అంటూ జీవన్‌రెడ్డి వ్యక్తం చేసిన మాటలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మారిన అభిప్రాయాలకు నిదర్శనం.
తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను పరిశీలిస్తే, ప్రాంతీయ స్వాభిమాన ఉద్యమం నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ ప్రయాణం పరిపాలనలో స్థిరత్వం, అభివృద్ధిలో స్పష్టత వంటి లక్షణాలతో ఒక ప్రత్యేక స్థాయిని సంపాదించుకున్నది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన నాయకులు ఈ వేదిక వైపు చూడడం సహజ రాజకీయ ప్రక్రియగా మారుతున్నది. పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ, రైతు సంక్షేమ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ మార్పులు కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా ప్రజల దైనందిన జీవితాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి, స్థిరత్వం ఉన్న వేదిక వైపు నాయకుల ఆకర్షణ పెరగడం సహజ పరిణామం. ప్రజల అభిలాషలకు అనుగుణంగా పనిచేసే వేదిక వైపు నాయకులు కదలడం, భవిష్యత్తులో స్థిరమైన రాజకీయ వ్యవస్థకు పునాది వేయగలదు. ఈ ప్రక్రియ కొనసాగితే సమన్వయ రాజకీయాలు మరింత బలపడటం ఖాయం.
-చిటికెన కిరణ్‌కుమార్
94908 41284