హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతిగుంట భూమికీ సాగునీరందించేలా కృషి చేద్దామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో సాగునీటిశాఖ ఉన్నతాధికారులు, సిరిసిల్ల అధికార యంత్రాంగం, జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని.. మిగిలిన భూమికి కూడా నీళ్లందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి చెరువుని నింపడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సూక్ష్మ స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతాంగం సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిలో నీటి వనరులు వాటి కింద ఉన్న ఆయకట్టు ప్రాజెక్టుల వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధితోపాటు.. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.