తెలంగాణ పసిడి పంటలకు నెలవుగా మారింది. రైతన్న పండించే పంటల విలువ అంతకంతకూ పెరుగుతున్నది. వరుసగా రెండేండ్ల పాటు రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్లను దాటింది. 2022-23లో రూ. 1.13 లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు, 2023-24లో ఏకంగా రూ.1.16 లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేశారు. సాక్షాత్తు కేంద్ర అర్థగణాంకశాఖ వెల్లడించిన వివరాలివి. 2011-12 నుంచి 2023-24 వరకు దేశంలో, రాష్ర్టాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల సంపద సృష్టికి సంబంధించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది.
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యవసాయరంగానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నాటి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం నిర్మాణం, మిషన్ కాకతీయ ఇలా అనేక రకాల రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. దీంతో రాష్ట్రంలో పంటలసాగు, ఉత్పత్తి భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇందుకు అనుగుణంగా పంటల ఉత్పత్తి, వాటి విలువ కూడా భారీగా పెరిగింది. గడిచిన పదేండ్లలో పంట ఉత్పత్తుల విలువ ఏకంగా రూ. 70 వేల కోట్లు పెరగడం గమనార్హం.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014-15లో రాష్ట్రంలో పండిన పంటల ఉత్పత్తి విలువ రూ. 45.36 వేల కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడిది రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం మొదలైందని చెప్పుకోవాలి. కాళేశ్వరానికి ముందు ఏడాది 2018-19లో రూ. 57.77 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తి కాగా కాళేశ్వరం ప్రారంభం తర్వాతి ఏడాది 2019-20లో పండిన పంటల విలువ రూ. 75.21 వేల కోట్లకు పెరిగింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఏటికేడు అంతకంతకు పెరుగుతూ పోయింది. 2020-21లో రూ. 84.15 వేల కోట్లు, 2021-22లో రూ. 97.55 వేల కోట్ల పంట ఉత్పత్తి కాగా, తొలిసారిగా 2022-23లో రూ. 1.13 లక్షల కోట్ల విలువైన పంట ఉత్పత్తుల పండించి లక్ష కోట్ల మైలురాయిని చేరుకున్నది. 2023-24లో రూ. 1.16 లక్షల కోట్లు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఐదున్నరెట్లు పెరిగిన ధాన్యం విలువ
ఉమ్మడి రాష్ట్రంలో బుక్కెడు బువ్వ కోసం ఏడ్చిన తెలంగాణ రైతన్నలు ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. ఇందుకు వరిసాగు, ధాన్యం ఉత్పత్తి అంకెలే ఉదాహరణ. 2014-15లో కేవలం 34.97 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 69.19 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయింది. కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలతో 2023-24లో వరిసాగు 117.61 లక్షల ఎకరాలకు పెరగ్గా 260.9 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ధాన్యం ఉత్పత్తి పెరగడంతో దాని విలువ కూడా పెరిగింది. 2014-15లో ఉత్పత్తి అయిన ధాన్యం విలువ కేవలం రూ. 9.52 వేల కోట్లు కాగా 2023-24లో ఉత్పత్తి అయిన ధాన్యం విలువ ఏకంగా రూ. 52.59 వేల కోట్లకు పెరిగింది. అంటే పదేండ్లలో ఐదున్నర రెట్లు ధాన్యం ఉత్పత్తి విలువ పెరగడం గమనార్హం.
కేంద్ర నివేదిక ప్రకారం ఉత్పత్తి అయిన ధాన్యం విలువ(వేల కోట్లు)
వరి సాగు(లక్షల ఎకరాలు), ధాన్యం ఉత్పత్తి(లక్షల టన్నులు)వివరాలు