హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలమున్న నేతలంతా గులాబీ పార్టీలో చేరిపోయారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర వెంకటరమణ, చర్ల ఎంపీపీ కోదండరామయ్య, వాజేడు జడ్పీటీసీ, ఎంపీపీ పుష్పలత, శ్యామల సీత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, బొలిశెట్టి రంగారావు, డివిజన్ అధ్యక్షుడు ఉడత రమేశ్, మండల అధ్యక్షుడు తాండ్ర నరసింహారావు, రేపాక పూర్ణచంద్ర, దుద్దునూరి సాయిబాబా, డివిజన్ సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ, సర్పంచులు ఉబ్బా వేణు, వెంకటేశ్వర్లు, పూసం ధర్మరాజు, ఎంపీటీసీలు సొడి తిరుపతిరావు, మడకం రామారావు, సీతారాములు, మడకం నాగేంద్రబాబు, అంజుపాక, సర్పంచ్ కారం మల్లేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు సతీశ్, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పనిచేస్తామని ఈ సందర్భంగా వారంతా మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఖమ్మం ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధుసూదన్, భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని విశ్వసించి పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణకు బీఆర్ఎస్, సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.