పాలమూరు/మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 15: మహబూబ్‌నగర్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డైట్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని కలిసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో సకల వసతులు కల్పించామని, గడిచిన పదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధే తమ మతమని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని కోరారు. చెప్పిందే కాదు చెప్పని పనులను కూడా చేసి చూపించామని వివరించారు. మహబూబ్‌నగర్‌ను దశదిశలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తరహాలో మన్యంకొండ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలిపి గ్రేటర్ మహబూబ్‌నగర్ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మెన్ వెంకన్న తదితరులు ఉన్నారు.