చండూరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఈశ్వర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మండలం శిర్ధేపల్లి, తాస్కానిగూడెంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలనను అందిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలుపెంచిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎత్తి వేసేందుకు కుట్రలు చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు.
పల్లె ప్రగతి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. రాజగోపాల్రెడ్డి గడిచిన నాలుగేండ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయని ఆరోపించారు.
అనంతరం మహిళలు, వృద్ధులు, యువతతో మంత్రి స్వయంగా మాట్లాడి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దామర యాదయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు గుర్రం వెంకట రెడ్డి, అయ్యోరి రాజేశ్, ఉరుమట్ల బుచ్చయ్య, మహేశ్, జగన్, దాసరి కోటి, బొల్లం స్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.