Jagadish Reddy | తెలంగాణ గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రామాలు.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని గ్రామాల రూప రేఖలు మార్చుకున్నామని గుర్తుచేశారు.
సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారం వేడుకకు జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పదేండ్లు ఎనలేని అభివృద్ధి సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది తెలంగాణ గ్రామాలే ఉన్నాయని.. మొదటి 20 గ్రామాల వారీగా చూసిన 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయని పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర కేసీఆర్ పాలనకే సాధ్యమైందని పేర్కొన్నారు.
పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచుకున్నామని.. వాటి సంరక్షణకై ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని జగదీశ్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా మంచినీటి సమస్య తీర్చామని, గ్రామానికో ట్రాక్టర్, వైకుంఠధామాలు, రోడ్లు ఇలా గ్రామానికి కావలసిన సౌకర్యాలు అన్ని పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాలు దేశంలోనే మరెక్కడా లేవని.. అందుకే మన తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిచాయని స్పష్టం చేశారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప.. గ్రామాలను ఐక్యతతో అభివృద్ధి చేసుకుందామని జగదీశ్ రెడ్డి సూచించారు. ఇదే కేసీఆర్ నేర్పిన అభివృద్ధి మంత్రం.. ఈ మార్గంలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అంతా ఐక్యతతో కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడపాలని పిలుపునిచ్చారు.