Telangana | వరంగల్, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది. కేసీఆర్ పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టుల ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని కీలకమైన మూడో దశ ఆయకట్టుకు కచ్చితంగా సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసింది. ధర్మసాగర్ రిజర్వాయర్ నిండితేనే జనగామ, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఆయకట్టుకు పూర్తిగా నీరు అందుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వేగంగా నీరు చేరేందుకు అవసరమైన టన్నెల్, పంప్‌హౌస్ పనులను పూర్తి చేసింది. పంప్‌హౌస్‌కు రక్షణ పనులు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసిన పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు.
కేసీఆర్‌తోనే మూడో దశ సాకారం
దేవాదుల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని సమైక్య ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దేవాదుల ప్రాజెక్టును దాదాపుగా పూర్తిచేశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీఎకరాకు సాగునీరు అందించేలా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. దేవాదుల ప్రాజెక్టుతో 9 జిల్లాల్లోని 5.57 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పనులు చేసింది. 2021 జూన్ 21న సీఎం కేసీఆర్ వరంగల్‌లో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. మూడో దశ పనులను వేగంగా పూర్తి చేసుకుందామని చెప్పారు.
టన్నెల్… పంప్ హౌస్
మూడో దశ కింద గోదావరి నది నుంచి దేవాదుల పంప్ హౌస్‌ల ద్వారా భూపాలపల్లి జిల్లాలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు అక్కడి నుంచి రామప్ప చెరువుకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి వరంగల్ నగర శివారులోని ఉనికిచర్ల వరకు 43.06 కిలోమీటర్ల టన్నెల్లో గోదావరి నీరు వస్తుంది. టన్నెల్ నుంచి వచ్చిన నీటిని అక్కడి నుంచి 6.86 కిలోమీటర్ల ధర్మసాగర్‌కు దేవన్నపేట వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ధర్మసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు.