హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావనను తీసుకొచ్చిన సీబీఐ.. దర్యాప్తు ముగిశాక వివరాలు సమర్పిస్తామని అప్పట్లో హైకోర్టుకు తెలిపింది. సీబీఐ రహస్య సాక్షిగా పేర్కొంటున్న పులివెందుల వైసీపీ నేత కొమ్మ శివచంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని గత జూన్ 30న కోర్టుకు సమర్పించారు. ఈ వాంగ్మూలాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 26న అధికారులు తీసుకున్నారు. కడప ఎంపీగా అవినాష్ పోటీ చేయరని, ఆయనకు జమ్మలమడుగు టికెట్ ఇస్తారని వివేకానందరెడ్డి తనతో చెప్పారని శివచంద్రారెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని చెప్తూ.. వైసీపీని వీడొద్దని వివేకా తనను కోరారని వెల్లడించారు. 2018 అక్టోబర్ 1న వివేకా తన ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పారని పేర్కొన్నారు. ఆ రోజు వరకు తాను వైసీపీకి సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా ఉన్నానని వెల్లడించారు. 2018 అక్టోబర్ 2న వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కొమ్మా శివచంద్రారెడ్డి ఆ తరువాత 2020 జూన్‌లో తిరిగి వైసీపీలో చేరారు. అయితే 2019 డిసెంబర్ 7న శివచంద్రారెడ్డి వాంగ్మూలం సిట్ నమోదు చేసినప్పటికీ, ఆయన పార్టీ మారిన నేపథ్యంలో మరోసారి ఏప్రిల్ 26న వాంగ్మూలం నమోదు చేశారు. సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నట్టు సీబీఐకి శివచంద్రారెడ్డి తెలిపారు.