కోరుట్ల రూరల్, జూన్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కావాలనే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో నాగులమ్మ కల్యాణ మండపాన్ని రూ.13 లక్షలతో నిర్మించామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది నాయకులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.