KTR | సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణలో జీవన విధ్వంసానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ‘స్వేదపతం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రేమ్ అమన్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆయన తెలంగాణ స్థితి గతులను అధ్యయనం చేస్తూ ఆ నాడు డాక్యుమెంటరీని తయారు చేశారు. కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతం.. పోలీసుల కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటు లేదు. ఉద్యోగాలు రావు. ఉద్దేశపూర్వక.. నేరపూరిత నిర్లక్ష్యంతో ఆ నాటి పాలకులు ఎటు చూసినా క్షమించలేని, క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేళాలకు తరలించే పరిస్థితి’ ఉండేదని గుర్తు చేశారు.
‘వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ సమైక్య పాలకులు డూడూ బసవన్నల మాదిరిగా వాళ్లు ఏం చెబితే దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువులపై నిర్లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలకు ఆయువుపట్టులాంటి చిన్ననాటి వనరులకు తీవ్ర అన్యాయం జరిగింది. గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్కబోర్ల పడ్డది వ్యవసాయం. చివరకు 54 బోర్లు వేసి రాంరెడ్డి ఆయన పేరు నల్లగొండ జిల్లాలో బోర్ల రాంరెడ్డిగా పేర్లుపడ్డ పరిస్థితి. అడవులు క్షీణించడంతో పూర్తిగా వర్షాపాతం పడిపోయింది. 900 మిల్లీమీటర్లు వర్షంపడే తెలంగాణలో అడవులు క్షీణించడంతో వర్షాపాతం కరువై.. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తిస్థాయి సంక్షోభం వైపు మళ్లింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రలు బారిన నేలలు, నెత్తురుగారిన నేలలు అన్నట్లుగా ఉండేది. మా నాయకుడు కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పేది. తెలంగాణ బతుకు అంటేనే బొంబాయి.. దుబాయి, బొగ్గుబాయి అనే తీవ్రమైన వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి’ అన్నారు.
‘మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే వెనుకబడిన జిల్లా. వెనుకబడిన జిల్లాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నయ్ అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఒకటి. పాలమూరు జిల్లా నుంచి 14లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు వెళ్లే దుస్థితి. వేల సంఖ్యలో ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. ఇవన్నీ యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు. ఇది నా కల్పన కాదు.. నా ఊహ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 2014 జూన్ 2 రోజున తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. పది జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాలకు బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేవి. ఒక రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటే.. తొమ్మిది జిల్లాలు అంటే 90శాతం భూభాగం వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిందంటే మరి తెలంగాణ ఏర్పడిన రోజు ఎలాంటి సంక్షోభిత పరిస్థితి ఉండేదో దాన్ని బట్టి చెప్పవచ్చు. చెబుతూ పోతే.. ఒకటి రెండు కాదు.. వనరుల విధ్వంసం’ జరిగిందన్నారు.
‘నల్లగొండలో జలసాధన పోరాటం చేసిన జలసాధన పోరాటం చేసిన సత్యనారాయణ ప్రధానమంత్రి వాజ్‌పేయి టేబుల్‌పై అంశాల స్వామిని పడుకోబెట్టి పరిస్థితిని వివరించినా ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కాని దైన్యం. పదుల కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి. బొంబాయికి వెళ్లే దుస్థితి.. నెర్రలు బారిన నేలలు.. చెబుతూ పోతే.. పగలని గుండె లేదు.. చెదరని స్వప్నం లేదు.. తడవని కండ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ దెబ్బకు 2లక్షల మంది చివరకు వలసపోయే దుస్థితి. మానవ రహిత జిల్లాగా, మానవ రహిత ప్రాంతంగా ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చివరకు చెప్పే దుస్థితి ఆ నాటి తెలంగాణకు వచ్చింది. ఆ నాడు ఎందరో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు గళమెత్తారు.. పాటలు రాశారు’ అంటూ గుర్తు చేశారు.
‘మిత్ర ప్రముఖమైన పాట రాసిండు. ‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా’ అంటూ పాలమూరు గోసను తన పాట రూపంలో మిత్ర చెప్పారు. మా గోరటి వెంకన్న ‘సేతానం ఏడుందిరా.. తెలంగాణ చేలన్నీ బీళ్లాయారా’ అంటూ గళం విప్పినా ఎన్నడూ కూడా దాని గురించి ఆ నాడు మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్, ఇతర నాయకులు మాట్లాడలేదు.. పట్టించుకోలేదు. చివరకు ఆదిలాబాద్ బిడ్డ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సదాశివుడు ‘తలాపున పారుతుంది గోదారి.. మన చేలు మన చెలక ఎడారి’ అంటూ రాశారు. ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా ఏ కవిని.. ఏ సాహితీవేత్తను, గాయకుడిని.. ఏ జర్నలిస్టును.. ఏ ప్రజాసంఘాల నాయకుడిని అడిగినా ఆ నాడు తెలంగాణ దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిన పరిస్థితి. 1969 ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమం విఫలమైన తర్వాత 32 ఏళ్లు పట్టించుకోని పరిస్థితి. ఎవరూ లేరని సమైక్య పాలకులు చెలరేగి పోయిన సమైక్యవాదులు.. వారికి తొత్తులుగా కాంగ్రెస్ నాయకులున్నారు. చివరకు ఏమైంది పరిస్థితి అయ్యిందంటే.. ‘నానాటికి తీసికట్టు.. నాగంబొట్టు’ అన్నట్లుగా పరిస్థితి. ఈ రంగం ఆరంగం కాదు.. అన్నిరంగాల్లో తీరని వివక్ష, అన్యాయం తెలంగాణకు జరిగింది. నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డ లేడు.. గుండెలు పగలని తెలంగాణ గడప లేదంటే అతిశయోక్తి కాదు’ అన్నారు.