హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైడ్రా అరాచకాలపై తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ), ఫొటో ఎగ్జిబిషన్‌కు హాజరైన హైడ్రా బాధితులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సర్కారు తీరుపై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో హాయిగా ఉన్నామని, కాంగ్రెస్ వచ్చి తమకు నిలువ నీడ లేకుండా చేసిందని వాపోయారు. ఇండ్లకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నా సెలవు రోజుల్లో వచ్చి తమ ఇండ్లను కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి, తమకు హైకోర్టు ఒకేసారి స్టే ఆర్డర్ ఇచ్చిందని, తిరుపతిరెడ్డి ఇంటి జోలికి వెళ్లలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని బాధిత కుటుంబాలు మీడియా సమక్షంలో వెల్లడించగా వారికి న్యాయం చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అన్నం తింటున్నవారిని నెట్టేసి కూల్చిండ్రు
ఆరు తరాలుగా మేము ప్యాకింగ్ వాటర్ బిజినెస్ చేస్తున్నం. ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్యాక్టరీ ఉన్నది.. కూల్చివేస్తామని హైడ్రా అధికారులు రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేసిండ్రు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో పనిచేసే 18 మంది కార్మికులు భోజనం చేస్తున్నరు. వారిని మెడపట్టి బయటకు గెంటి ఫ్యాక్టరీని కూల్చివేసిండ్రు. కనీసం మిషనరీ తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలే. బతిమిలాడినా పట్టించుకోలే. నోటీసులు ఇచ్చి ఆక్రమణ అని తేలితే కూల్చడానికి అభ్యంతరం లేదు. కానీ, సామాన్లు కూడా తీసుకోడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేసిండ్రు. ఫ్యాక్టరీ నిర్వహణకు లైసెన్స్ ఉన్నది. అన్ని పన్నులు కడుతున్నం. మా నాన్న ఇదే బిజినెస్ చేసిండు. మేము కూడా చేస్తున్నం. నీళ్ల బిజినెస్ చేస్తున్న మాది ఆరోతరం. 18 మంది కార్మికులతోపాటు మా కుటుంబం ఉపాధిని కూడా కోల్పోయినం.
-తల్లి సంగీత శర్మ, కుమారులు ప్రతీక్ శర్మ, వరుణ్ శర్మ, బేగంబజార్
కాళ్లు పట్టుకుంటే యాక్టింగ్ చేయకన్నరు
పదేండ్ల నుంచి ఉంటున్న మా ఇండ్లన్నింటినీ తెల్లవారక ముందే కూల్చిండ్రు. ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టిండ్రు. జీహెచ్ఎంసీలో స్వీపర్ పనిచేస్త. పెత్తరామాస రోజు తెల్లవారుజామున 4 గంటలకు డ్యూటీకి వెళ్తున్న నేను పోలీసు వ్యాన్లు చూసి వెనక్కి వెళ్లిన. అధికారులు కరెంట్ కట్ చేసిండ్రు. పెత్తరామాస రోజున పూలు తెచ్చేందుకు కొందరు వెళ్లారు. ఇండ్లకు తాళాలు ఎందుకున్నయని అధికారులు అడిగిండ్రు. 50-60 గజాల్లోనే మేము ఇండ్లు కట్టుకున్నం. అన్నీ కూల్చిండ్రు. కూల్చొద్దు అని కాళ్లు పట్టుకుంటే యాక్టింగ్ చేయకు అన్నరు. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మను వేసేందుకు నీళ్ల హౌస్ కట్టుకుంటే దాన్ని కూడా కూల్చేసిండ్రు. ఇంటి నుంచి మా అమ్మను పోలీసులు ఈడ్చివేస్తే చెయ్యికి దెబ్బతగిలింది. మీరు లేనోళ్లు గుడిసెలు వేసుకొని బతుకండి అని నాడు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఆయన ప్రభుత్వమే మా ఇండ్లను కూల్చింది. గరీబోళ్ల మీద పడుతున్నరు కానీ, పెద్దల జోలికి మాత్రం పోతలేరు.
-వెంకటమ్మ, గాజులరామారం
అనాథాశ్రమాన్ని కూలగొట్టిండ్రు

దుబాయిలో 13 ఏండ్లు కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బుతో చిన్న అనాథాశ్రమం నడుపుతున్న. ఎవర్నీ చందాలు అడగలేదు. దివ్యాంగుడైన నా తమ్ముడు వంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆశ్రమం పెట్టిన. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో పట్టా భూమిని కొనుగోలు చేసిన. స్టే ఆర్డర్ తీసుకొచ్చిన. ఆశ్రమంలో ఏడుగురు పిల్లలున్నరు. పిల్లలను ఈడ్చివేసి కూల్చివేసిండ్రు. వాటర్ సంపు కూడా కూల్చివేసిండ్రు. ఏదీ లేకుండ జేసిండ్రు. పట్టాభూముల్లో చిన్నచిన్న పిల్లలు ఉంటున్న ఇండ్లను కూడా కూల్చివేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా, అన్ని కాగితాలున్నా పట్టించుకోకుండా కూల్చిండ్రు.
-దుర్గమ్మ, గాజుల రామారం
టీ కొట్టు కూల్చిండ్రు
ఏ పనీ దొరక్క కొండాపూర్‌లో టీ కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునేటోడిని. కొట్టు మంచిగా నడుస్తుండె. రోజుకు రూ.1000-1500 వస్తుండె. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు హెచ్చరికలు చేయకుండా హైడ్రా అధికారులు పొద్దున్నే వచ్చిండ్రు. టీకొట్టును కూల్చాల్సి ఉన్నది దూరంగా పొమ్మని బెదిరించిండ్రు. కనీసం సామాన్లు తీసుకోవడానికి 10 నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. దూరం నుంచి చూసిన అంతే. దగ్గరకు కూడా అధికారులు రానివ్వలే. అప్పు చేసి సామాన్లు కొన్న. నాకు రూ.4 లక్షల నష్టం జరిగింది. ఇది తప్ప మరో బతుకు దెరువు లేదు. మా కుటుంబ బతుకుదెరువు మీద హైడ్రా దెబ్బకొట్టింది.
-మొయిన్, కొండాపూర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లనే కూల్చిండ్రు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్నందుకు ప్రోత్సాహకంగా నాడు ఇందిరమ్మ ప్రభుత్వం కొండాపూర్‌లో మాకు పట్టాలిచ్చింది. 40 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. పండుగ రోజు హైడ్రా అధికారులు మమ్మల్ని ఇంట్లోంచి గుంజుకొచ్చి కూలగొట్టిండ్రు. గతంలో కూరగాయలు అమ్ముకొని బతికినం. ఇప్పుడు గుళ్ల వద్ద అడుక్కు తింటున్నం. పిల్లల పెండ్లిళ్లు చేద్దామనుకుంటే మా బతుకులను ఆగం చేసిండ్రు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు పేదోళ్లు గుడిసెలు వేసుకోండ్రి అని చెప్పిండు. ఇప్పుడు సీఎం కాంగనే వచ్చి కూల్చేసిండు. రేవంత్‌రెడ్డి వచ్చి మమ్మల్ని మోసం చేసిండు. మా జాగలు మాకు వచ్చేటట్టు చెయ్యిండ్రి సారూ..
-పోచమ్మ, కొండాపూర్
అందరికీ న్యాయం చేస్తాం: కేటీఆర్
హైడ్రా బాధితులందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయం పోరాటం చేయాలనుకొనే వారికి మా బీఆర్ఎస్ సెల్ అండగా ఉంటుంది. మీ వద్ద రూపాయి లేకున్నా మా పది మంది న్యాయవాదుల బృందం న్యాయస్థానాల్లో పోరాడుతుంది. హైకోర్డు ఆర్డర్ ఉన్నా, సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేశారని న్యాయవాదులు కోర్టుల్లో కొట్లాడుతారు. మరోవైపు అసెంబ్లీలో కూడా హైడ్రా బాధితుల సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరఫున నిలదీస్తాం. న్యాయస్థానాల్లో, అసెంబ్లీలో చర్చించినా న్యాయం జరగకుంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రా బాధితులందరికీ న్యాయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు.
చీరెలు ఊసిపోతున్నా ఈడ్చిపారేసిండ్రు

బండి మీద రొట్టెలు చేసి అమ్ముతూ బతుకు వెళ్లదీస్తున్న. వర్షం పడితే పిడుగు పడినట్టు హైడ్రా వచ్చింది. మా ఇండ్లను కూల్చింది. మేము అంత దొంగ పని ఏంజేసినం? చాలా ఏండ్ల నుంచి ఇక్కన్నే ఉంటున్నం. అనేక ప్రభుత్వాలు వచ్చినయ్.. చూసినయ్. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తామంటే నమ్మినం. ఇప్పుడొచ్చి కూల్చివేస్తే బతికేదెట్ల? మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం మాకు జరిగింది. చీరెలు ఊసిపోతున్నా మమ్మల్ని హైడ్రా అధికారులు ఈడ్చిపారేసి ఇండ్లు కూలగొట్టిండ్రు. నా భర్తకు కాళ్లు పోయినయ్. ఇద్దరు ఆడ పిల్లలున్నరు. మా కుటుంబం ఎట్ల బతుకుడు? ఇప్పుడు రొట్టెల బండి కూడా లేకుండ చేస్తమని అధికారులు బెదిరిస్తున్నరు.
-బాలమ్మ, గాజులరామారం