గజ్వేల్, జూలై 29 : రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 16 మంది ఎంపీలున్నా రైతులకు సరిపడా యూరియాను తీసుకరాలేకపోతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని మాట్లాడుతుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపిందని పేర్కొంటున్నారు.
యూరియా ఉంటే రైతులు కుటుంబ సభ్యులతో కలిసి పాస్‌పుస్తకాలతో తెల్లవారుజామునుంచే రోడ్లమీదికి ఎందుకొస్తారని ప్రశ్నించారు. ఎకరానికి ఒక యూరియా బస్తా ఇస్తామంటే ఎలా సరిపోతుందో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని నిలదీశారు. ఐదు రోజుల్లో యూరియా అందకపోతే పంటలు పాడైపోతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా యూరియా కోసం రైతులు రోడ్లపైకి రాలేదని గుర్తుచేశారు.
యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రం, చెన్నూరు సొసైటీల్లో మంగళవారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. పోలీసులు వచ్చి వ్యవసాయాధికారులు రాసిన కూపన్లను వరుస క్రమంలో రైతులకు అందజేశారు. రైతులందరికీ యూరియా అందిస్తామని ఏవో రూప తెలిపారు.