హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, జీవో 252 రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు జీవో-252పై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే వార్తలకు ప్రాణం వస్తుందని, అలాంటప్పుడు ఈ విభజన ఎందుకని ప్రశ్నించారు. డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు కాకుండా మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. జర్నలిజంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన సరికాదని హితవు పలికారు. ఇదివరకే ఇండ్ల స్థలాల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఈ విభజనతో వారి ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆరోగ్యాలను పణంగాపెట్టి పనిచేస్తున్న తమకు.. అక్రెడిటేషన్ ఇవ్వకపోడమంటే.. కష్టపడి సాధించుకున్న హక్కును గుంజుకోవడమే అవుతుందని మండిపడ్డారు. పత్రికల యాజమాన్యాలు డెస్ జర్నలిస్టుల నియామక సమయంలో డెస్/రిపోర్టింగ్ పేరిట నియామక పత్రాలు జారీచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు, ఇండ్ల స్థలాల కేటాయింపు లో కోత పెట్టేందుకే ఈ విభజన చర్చకు పూనుకున్నారని అనుమానం వ్యక్తంచేశారు. బస్‌పాస్‌ల విషయంలోనూ ఐఅండ్‌పీఆర్ అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల తీసుకున్న నిర్ణయంతో ఏండ్లతరబడి పనిచేస్తున్న వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికే చాలామంది డెస్క్ జర్నలిస్టులు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా, కొందరు మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు తాజా నిర్ణయంతో డెస్క్ జర్నలిస్టుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. జీవో-252ను ఉపసంహరించుకునే వరకు డెస్క్ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ, కలిసి వచ్చే యూనియన్లు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డీజేఎఫ్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
డీజేఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్, ఉపాధ్యక్షుడిగా కేవీ రాజారాం, జాయింట్ సెక్రటరీగా విజయ, ట్రెజరర్‌గా నిస్సార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులకు ఎప్పటిగానే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని, వర్కింగ్ జర్నలిస్టులను వేరుచేసేలా ఉన్న జీవో- 252ను వెంటనే రద్దు చేయడంతోపాటు, హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లను కలిసి మెమోరాండం సమర్పించాలనే పలు డిమాండ్లతో పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో హెచ్‌యూజే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణ్‌కుమార్, జగదీశ్, టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అక్రెడిటేషన్ల జారీ కోసం వెలువరించిన జీవో-252 అస్పష్టంగా ఉన్నదని, జర్నలిస్టుల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నదని వరింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. డెస్క్ జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫీల్డ్, డెస్ జర్నలిస్టుల మధ్య విభజన రేఖ గీసేందుకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం ప్రయత్నించిందని అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రస్తుత జీవో ద్వారా ఇక వారి ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని, డెస్ జర్నలిస్టులు సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. తమ హకుల సాధన కోసం డెస్ జర్నలిస్టులు చేసే పోరాటానికి డబ్ల్యూజేఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా కూడా డెస్ జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.