TS Symbol | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రకు దర్పణంగా ఇన్నాళ్లూ ఠీవిగా నిలబడిన రాష్ట్ర చిహ్నం.. ఇకపై రంగులు, హంగులమయం కానున్నదా? వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలుపుతూ.. పైపై మెరుగులతో డిజైన్లు సిద్ధమయ్యాయా? పోరాట స్ఫూర్తికి ప్రతిబింబంగా మార్చుతామంటూ చేసిన ప్రకటనలు ఉత్తిమాటలుగా మారాయా? ‘జయ జయహే తెలంగాణ’ గీతంలోనూ కాకతీయులు, గోల్కొండ సామ్రాజ్య దీప్తి ఆనవాళ్లు చెరిగిపోనున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తున్నది. రాష్ట్ర చిహ్నం, ‘జయ జయహే తెలంగాణ’ గేయంలో మార్పులు, చేర్పులు తుది దశకు చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం తన నివాసంలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రచిహ్నం తుది రూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో వారు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు డిజైన్లను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసినట్టు తెలిసింది. రాష్ట్రగీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమారతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా మార్పులు చేర్పులపై చర్చించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రూపొందించిన పలు డిజైన్లను సమీక్ష సందర్భంగా ప్రదర్శించినట్టు తెలిసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని బట్టి రాష్ట్ర చిహ్నంలో నాలుగు సింహాల చిహ్నాన్ని కొనసాగిస్తూ.. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. వీటికి బదులుగా పూర్ణకుంభం, తంగేడు ఆకులు, హుస్సేన్‌సాగర్‌లోని గౌతమబుద్ధుడి విగ్రహం వంటివాటితో డిజైన్లను రూపొందించినట్టు తెలిసింది. దీంతోపాటు అశోకచక్రం, పరిశ్రమలను సూచించేలా అర్ధచక్రం, ఆకులతో కూడిన డిజైన్లను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్త చిహ్నంలో గన్‌పార్క్, అమరవీరుల స్తూపం ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే, సమ్మక్క-సారక్క పోరాటం, నాగోబా జాతర స్ఫూర్తిని తలపించేలా కొత్త లోగో ఉంటుందంటూ కొన్నాళ్లుగా చేస్తున్న ప్రచారం ఉత్తిదేనని సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలను బట్టి స్పష్టమవుతున్నది. ప్రస్తుత చిహ్నంలో ఆకుపచ్చ, బంగారు వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అందరూ కలలుగన్న బంగారు తెలంగాణను స్ఫురించేలా బయటి వృత్తం, పాడిపంటలతో పచ్చని తెలంగాణను స్ఫురించేలా లోపల ఆకుపచ్చ రంగును వినియోగించారు. అయితే, కొత్త చిహ్నాన్ని రంగురంగులతో నింపి, చూడగానే కంటికి ఇంపుగా ఉండేలా తీర్చిదిద్దినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లోగోలో ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అర్థం వచ్చేలా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో రాసి ఉండగా.. కొత్త లోగోలో హిందీని కూడా చేర్చినట్టు తెలుస్తున్నది.
రాచరికపు ఆనవాళ్లు పేరుతో ‘జయ జయహే తెలంగాణ’ పాటలోనూ చరిత్ర కనిపించకుండా పలు మార్పులు చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఉద్యమ సమయంలో రాసిన గేయంలో ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప.. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’ అనే చరణాలు ఉన్నాయి. ఈ రెండు చరణాలను పక్కనపెట్టేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, దీంతో వాటికి బదులుగా వేరే చరణాలు జొప్పించారని ప్రచారం జరుగుతున్నది. గతంలో వినిపించిన పాటలో సంగీతం ఉద్యమస్ఫూర్తిని రగిలించేలా, తెలంగాణ ప్రాంత భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఉండగా.. కీరవాణి స్వరపరిచిన గీతంలో సంగీత వాయిద్యాల హోరుతో సినిమా పాటను తలపించేలా సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం విడుదల చేసిన సీఎం సమీక్ష ఫొటోల్లో ప్రముఖ గాయకుడు రేవంత్ ఉండటంతో, ఆయనే ఈ పాటను పాడినట్టు చర్చ జరుగుతున్నది. మొత్తంగా రాచరికపు ఆనవాళ్ల పేరుతో వందల ఏండ్ల తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపివేసి, దశాబ్దాలుగా తమకు నచ్చిన నేతల పాలనను స్ఫురించేలా రంగురంగుల చిహ్నాన్ని, గీతాన్ని రూపొందించి ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారనే చర్చ సాగుతున్నది.
తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయుల తోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర చిహ్నంలో మార్పు పాలనలో తప్పులకు నిదర్శనం. వ్యవసాయం, నీళ్లకు కళాతోరణం, వైద్యం, సంక్షేమానికి చార్మినార్ చిహ్నం.
-బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
తెలంగాణ రాజముద్రను మార్చడం దుర్మార్గం. క్రూరమైన ఆలోచనలతో తెలంగాణ ఆత్మపై దెబ్బకొట్టడమే. కేసీఆర్ పెట్టిండు కాబట్టి తీసేస్తామనడం దుర్మార్గం.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి ప్రభుత్వం తీసేసింది. మరి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా?
– కర్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ
ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయలకు గుర్తింపు కళాతోరణం. కాకతీయుల పాలనావైభవాన్ని చాటిచెప్పే చిహ్నం. రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పడూ ప్రజల ఆమోదయోగ్యంగానే ఉండాలి.
– అంపశయ్య నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అవుతుంది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను కాంగ్రెస్ ప్రభుత్వం గాయపరుస్తున్నది. కాకతీయ కళాతోరణం తెలంగాణ నేలకు నిలువెత్తు రూపం. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. కాబట్టి చిహ్నాలను తొలగించకుండా పాత వాటినే కొనసాగించాలి.
– విఎన్ శేషాచార్య తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు
తెలంగాణ చరిత్రలో భాగమైన ఓరుగల్లు కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో కూడిన రాష్ట్ర అధికారిక రాజముద్రనే బాగున్నది. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిహ్నాలను తొలగిస్తామనడం భావ్యం కాదు. గత పాలకుల హయాంలో జరిగిందనే అక్కసుతోనే కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాల్సి వస్తుంది.
– చింత మహేశ్, తెలంగాణ ఉద్యమకారుడు