హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, అక్రమంగా నిర్బంధిస్తున్నారని విమర్శించారు. దాడుల సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎప్పుడైనా దాడులు జరిగాయా అని నిలదీశారు. పార్టీ నేత దేవీప్రసాద్తో కలిసి ఆయన హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
తెలంగాణను నాశనం చేసేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఆయన విధ్వంసకర పరిపాలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణను ప్రేమించే వాళ్లు రేవంత్ వైఖరిని ఖండించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని దేవిప్రసాద్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మౌనంగా ఉండటం దేనికి సంకేతమని విమర్శించారు. సరైన సమయంలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ప్రతిపక్షాలను అనచివేయాలని చూస్తున్నారని చెప్పారు.