సిద్దిపేట, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దేవీప్రసాద్, పల్లె రవికుమార్, బాలరాజు యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ను నిలువరించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు.నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గత ప్రభుత్వం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని తెలిపారు. ప్రాజెక్టుపై అవగాహన లేని మంత్రులు అసెంబ్లీలో అవాకులు, చవాకులు మాట్లాడారన్నారు. సీబీఐ, ఈడీలపై గతంలో విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆ సంస్థలపై నమ్మకం ఎలా కుదిరిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దేశపతి తెలిపారు.