ములుగు, జూలై 13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు శరామామూలుగా మరోసారి విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేశారు. సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో ఉన్న దేవాదుల పంప్‌హౌస్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన వారు ముందుగా సమ్మక్క బరాజ్‌ను పరిశీలించి దేవాదుల పంప్‌హౌస్ మోటర్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు. దేవాదుల పర్యటనలో మంత్రులు గోదావరి జలాల వినియోగంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటర్లతో నీటిని ఎత్తిపోయడం లేదనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే ప్రయత్నించారు. పేరుకు దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నట్టు చెప్పి.. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుపైనే మాట్లాడారు.
తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని పొంతన లేని మాటలు మాట్లాడారు.ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం నిపుణుల సూచనల మేరకు వచ్చే ఎండాకాలం వరకు పూర్తి మరమ్మతులు చేపడుతామని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న 10 మోటర్లలో ప్రస్తుతం 7 మోటర్లు నడుస్తున్నాయని, ఒకటి,రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పంపులను నడిపించి సాగు, తాగునీటిని అందిస్తామని తెలిపారు. భూ సేకరణ పనులను పూర్తి చేసి రూ.194 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. స్థానిక మంత్రి సీతక్కతోపాటు మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, నర్సంపేట, వరంగల్ తూర్పు, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకుండానే సమీక్ష నిర్వహించారు.