హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘అకస్మాత్తుగా బంద్‌కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం. మీరిలా చేస్తే ఎట్లా? అల్లరి చేస్తే మీకే నష్టం’.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలివి! 20 నెలలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి బంద్‌కు వెళ్తామని అల్టిమేటం జారీ చేసిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య ప్రతినిధులను శనివారం చర్చలకు పిలిచి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలు. చర్చలకు పిలిచి, రుసరుసలాడటం, హెచ్చరించడం సరికాదని కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘బకాయిలు విడుదల చేయాలని వినతిపత్రాలిచ్చాం.
ఆ తర్వాత ప్రభుత్వానికి ఆర్థికభారంలేని ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్పించాం. మంత్రులు, అధికారులను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేనందువల్లే బంద్‌కు పిలుపునివ్వాల్సి వచ్చింది’ అని తేల్చిచెప్పినట్టు సమాచారం. ‘తొందరపడొద్దు.. బకాయిలు విడుదలచేస్తాం’ అని డిప్యూటీ సీఎం చెప్పగా.. ‘ఎప్పటిలోగా ఇస్తారో చెప్పండి. దసరాలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇస్తేనే బంద్ పిలుపును విరమిస్తాం’అని కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు స్పష్టంచేశారు. దీంతో ‘నేను ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మాట్లాడుతాను’ అని భట్టివిక్రమార్క తెలపగా.. ‘సోమవారం వరకు ఎన్ని బకాయిలు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పండి, అలా అయితేనే బంద్ పిలుపును విరమిస్తాం. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు బకాయిలు విడుదల చేశారు. మేమేం పాపం చేశాం?’ అని కాలేజీల ప్రతినిధులు ముక్తకంఠంతో మంత్రికి తేల్చిచెప్పారు. అయినా కూడా భట్టివిక్రమార్క ఎలాంటి హామీ ఇవ్వకుండానే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పిలుపునిచ్చిన మేరకు సోమవారం నుంచి కాలేజీలు మూసివేసి, ఆందోళనబాట పట్టాలని నిర్ణయించారు.
సెమిస్టర్ పరీక్షలూ బహిష్కరణ
నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్న కాలేజీ యాజమాన్యాలు సోమవారం నుంచి జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరించాలని, పరీక్షల నిర్వహణకు సహకరించవద్దని తీర్మానించాయి. సోమవారం నుంచి బీఈడీ ఒకటో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాల్సి ఉంది. యాజమాన్యాలు కాలేజీల బంద్‌కు పిలుపునివ్వడంతో మహత్మాగాంధీ యూనివర్సిటీ ఈ పరీక్షలను వాయిదావేసింది. తిరిగి ఈ నెల 26 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. జేఎన్టీయూ పరిధిలో బీ-ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. కాలేజీల యాజమాన్యాలు మూకుమ్మడిగా బంద్ ప్రకటించడంతో ఈ పరీక్షలు కూడా సందిగ్ధంలో పడ్డాయి.
సోమవారం కీలక సమావేశం
సర్కారుతో చర్చలు విఫలం కావడం, స్పష్టమైన హామీ రాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు బంద్ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యే వరకు విశ్రమించొద్దన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ మే రకు ఎఫ్ఏటీహెచ్ఈఐ ప్రతినిధులు సోమవా రం ఉదయం అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అన్ని కాలేజీల యాజమాన్యాలను ఆహ్వానించారు. సోమవారం ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోతే కాలేజీల బంద్ కొనసాగించడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
ఫలించని రెండో విడత చర్చలు
వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాలతో భట్టివిక్రమార్క జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి హామీ ఇవ్వకుండానే డిప్యూటీ సీఎం సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎఫ్ఏటీహెచ్ఈఐ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి రెండో విడత చర్చలు జరిపారు. బంద్ పాటించవద్దని, బకాయిలు చెల్లిస్తామని ఇరువురు చెప్పినట్టు తెలిసింది.
బంద్ పిలుపుతో ఉలిక్కిపడ్డ సర్కారు!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై 20 నెలలుగా జాప్యం చేస్తున్న ప్రభుత్వంలో.. బంద్ పిలుపుతో కదలిక వచ్చిందని భావించామని ఎఫ్ఏటీహెచ్ఈఐ తెలిపారు. 1500లపైగా కాలేజీలను సోమవారం నుంచి మూసివేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ పెద్దల నుంచి ఏదైనా హామీ లభిస్తుందని ఆశించామని చెప్తున్నారు. కానీ చర్చలు కూడా నిరుత్సాహం మిగిల్చాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో ఇంజినీరింగ్, న ర్సింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, లా కాలేజీలను మూసివేస్తామని, తరగతు లు నిర్వహించబోమని హెచ్చరించారు. ఆందోళనబాట తప్పడంలేదని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు చెప్పారు.