ఖమ్మం, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, అలా కాకుండా వాటిని వేలం వేస్తే సహించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు.
బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా ఉన్న సింగరేణి సంస్థకే ఆ గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కోయగూడెం, సత్తుపల్లి సింగరేణి గనులను వేలంలో పొందిన అరబిందో, ప్రతిమ కంపెనీలు ఎవరికి సన్నిహితమో ప్రజలకు తెలుసునని విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు. 2015లో బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించాలని కేంద్రం చట్టం చేసిందని, ఈ చట్టానికి నాటి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికారని ఆరోపిం చారు. బొగ్గు గనుల వ్యవహారంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఖిలపక్షంతో ప్రధానిని కలిసి సమస్య తీవ్రతను వివరిస్తామని తెలిపారు.
అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు తాను, మరికొందరి మంత్రులు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు, సీపీఐ శాసనసభ్యుడు ఉంటారని వివరించారు. బీఆర్ఎస్ కూడా ఈ అఖిలపక్షంలో భాగస్వామ్యమై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి తొలుత కేంద్రాన్ని కోరుతామని, సాధ్యంకాని పక్షంలో వేలం ద్వారానైనా సాధించుకునే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 2015లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల అధికారంలో వందేళ్ల చరిత్ర గల సింగరేణికి గనులు కేటాయించకుండా చేశారన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణిని కాపాడుకోవడం కోసం ప్రత్యక్ష ఆందోళన చేపడతామన్నారు.