హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన భట్టి.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని విద్యుత్తుశాఖ సీఎండీలను ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు రత్నాకర్‌రావు, శ్రీధర్, బీసీరెడ్డి, వరప్రసాద్, వేణుగోపాల్, సదానందం, వేణు, వెంకటనారాయణరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణరాజు, పీవీరావు, ప్రశాంత్, కిశోర్, వెంకటేశ్, సుజిత్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు వినతిపత్రం అందజేశారు. జూలై 2022 నుంచి రావాల్సిన నాలుగు విడతల(14.56 శాతం)డీఏ మంజూరు చేయాల్సి ఉండగా, నేటికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా డీఏ ప్రకటించేలా శాశ్వత విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు దాసరి శ్రీధర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసి 40 రోజులు గడుస్తున్నా అప్పీళ్లను పరిష్కరించకపోవడం తగదని టీఎస్‌యూటీఎఫ్ ఆక్షేపించింది. వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రక్రియ జరిగినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, అధికారుల తప్పిదాల కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు విద్యాశాఖ అప్పీళ్లకు వారంపాటు గడువు ఇచ్చిందని, అప్పీళ్లు పరిషారం కాకపోవడంతో వారు నిత్యం డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. అప్పీళ్లను పరిశీలించి వెంటనే పరిషరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
తమకు పదోన్నతులు కల్పించాలని సచివాలయ సెక్షన్ ఆఫీసర్లు(ఎస్వో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్వో)ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎస్వోలు, ఏఎస్‌వోలు గురువారం సచివాలయంలో జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావును కలిసి విన్నవించారు. ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించినట్టే తమకు కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రఘునందన్‌రావు వారికి హామీ ఇచ్చారు.