హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఎంతో ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లారు. కానీ అక్కడి శిలాఫలకం చూసిన తరువాత ఆయన ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది. అగ్రరాజ్యం అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురసరించుకుని గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని నామకరణం చేశారు. అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్, మన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార కలిసి ఎంతో వైభవంగా మంగళవారం రాత్రి ఆ శిలాఫకాన్ని ఆవిష్కరించారు. అంతా బాగుంది అనుకొనేలోపే అసలు ట్విస్ట్ బయటపడింది. శిలాఫలకంపై కప్పిన తెరను భట్టి విక్రమార ఎంతో చిరునవ్వుతో తొలగించారు. తీరా చూస్తే.. అకడ సీఎం రేవంత్రెడ్డి, సెర్జియో గోర్ పేర్లు మాత్రమే ఉన్నాయి. డిప్యూటీ సీఎం పేరు ఎకడా కనిపించలేదు. సాధారణంగా మన దగ్గర చిన్న గల్లీలో సిమెంట్ రోడ్డు వేసినా, శంకుస్థాపన శిలాఫలకంపై సీఎం, డిప్యూటీ సీఎం పేర్లు.. వాటి కింద ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించి మంత్రులు, స్థానిక కార్పొరేటర్ల పేర్లు ముద్రిస్తుంటారు. కానీ ఇక్కడ శిలాఫలకం ఆవిష్కరించిన భట్టి పేరే అక్కడ లేకపోవడంతో ఆయన ముఖకవళికలు ఒకసారిగా మారిపోయాయి. అప్పటివరకు వెలిగిపోయిన ముఖంలో ఒకసారిగా కంగుతిన్న భావాలు కనిపించాయి. దీంతో ఈ విషయం అక్కడ చర్చనీయాంశంగా మారింది.