Telangana | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆదివారమే సంతృప్తికర స్థాయిలో పథకాలను అమలు చేస్తామని చెప్పారు. నాలుగు పథకాల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు మీడియాతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని, ఆ గ్రామంలో సంతృప్తికర స్థాయిలో నాలుగు పథకాలను పూర్తి చేయబోతున్నాం. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులన్నీ క్రోడీకరించి, అర్హులను గుర్తించి, అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇస్తాం.
మార్చికల్లా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాం’ అని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని నిరుపేదల్లో 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకోనివారు ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. అర్హత ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తామని అన్నారు. రేషన్ కార్డులు పొందిన వారందరికీ త్వరలో ఆరు కిలోల సన్న బియ్యాన్ని అందజేస్తామని చెప్పారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల రాష్ట్రవ్యాప్త అమలుపై ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ఎవరైనా అనర్హులకు పథకాలు దక్కితే తమకు ఫిర్యాదు చేయాలని, వాటిని రద్దు చేస్తామని చెప్పారు.
పథకాల అమలుకు ప్రత్యేక బృందాలు
మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి అర్హులైనవారందరికీ ఆదివారం నాలుగు పథకాలను అమలు చేయాలని, ఈ మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్‌కార్డులకు తాసీల్దార్ నేతృత్వంలోని బృందం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎండీవో ఆధ్వర్యంలో, రైతు భరోసా కోసం మండల వ్యవసాయ అధికారి, లేదా డిప్యూటీ తాసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకం ఏపీఓ నేతృత్వంలో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవ సభకు లబ్ధిదారులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రముఖంగా ప్రదర్శించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయ కార్యదర్శులు శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, గృహనిర్మాణశాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్ , పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల ఉరుకులు.. పరుగులు
నాలుగు పథకాల సంపూర్ణ అమలుకు మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గ్రామాలను వెంటనే ఎంపిక చేయాలని మండల అధికారులకు శనివారం మధ్యాహ్నం అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో వారు హడావుడిగా తమ పరిధిలోని గ్రామాల జాబితాను తీసి, పెద్దగా ఇబ్బందులు లేని గ్రామాలను ఎంపిక చేశారు. తర్వాత ఆయా గ్రామాలకు వెళ్లి పథకాల ప్రారంభానికి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇంకా అర్హులు ఎవరైనా మిగిలిపోయారా? కొత్తగా దరఖాస్తులు ఏమైనా వచ్చాయా? వంటి వివరాలు ఆరా తీశారు. లబ్ధిదారులను అందరినీ కార్యక్రమానికి తీసుకురావాలని ఆదేశించడంతో వారు ప్రతి ఒక్కరికీ సమాచారం అందించారు. ఇలా మండలస్థాయి అధికారులంతా అర్ధరాత్రి వరకు గ్రామంలోనే ఉండి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.