హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): తెలంగాణ తల్లి విగ్రహం, గేయాన్ని మార్చకుండా చట్టం తీసుకురావాలని శాసనమండలిలో సభ్యులు అభిప్రాయం వ్యక్తంచేశారు. తరచూ రాష్ర్టానికి సంబంధించిన చిహ్నాలు, విగ్రహం, గేయాన్ని మార్చడం వల్ల భవిష్యత్తు తరాలు రాష్ట్ర ఉనికిని అర్థం చేసుకునే అవకాశం కోల్పోతారని చెప్పారు. సోమవారం శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదని, నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగమని పేర్కొన్నారు. విగ్రహాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సభ్యులు పేర్కొన్నారు. చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభ్యులు జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి, రఘుమారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలకు వ్యతిరేకం ; ఎమ్మెల్యే సూర్యనారాయణ
ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుతామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ తెలిపారు. ఢిల్లీ పెద్దలు, సోనియమ్మ మెప్పుకోసం రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఒకరోజంతా అసెంబ్లీ నడిపారని దుయ్యబట్టారు. చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.