Fire Accident | గుల్జార్‌హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఘటన జరుగడం అత్యంత దురదృష్టకరంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారని తెలిపారు. సహాయక చర్యల్లో 11 ఫైరింజన్లు, ఒక రోబోను వాడారన్నారు. ప్రమాద తీవ్రత పెరగకుండా సిబ్బంది నియంత్రించగలిగారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
చార్మినార్‌కు దగ్గరలోని భవనంలో ఉదయం 6.15 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్యూట్‌తో చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని చెప్పారు. మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని దవాఖానకు తరలించామని, నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందికి వచ్చారని చెప్పారు. ఈ ఘటనలో 17 మంది చనిపోయారని తెలిపారు. ప్రధాన ద్వారం వద్ద నిత్యం షార్ట్ సర్య్కూట్ జరుగుతున్నదని కార్మికులు చెప్పారని.. అయితే, అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు.