హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన మనస్తాపం చెందారని, అందుకే తామంతా తరలివచ్చినట్టు చెప్పారు. అలాంటి వాళ్లకు ఇబ్బంది కలిగితే తామంతా బాధపడతామని పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జీవన్‌రెడ్డి ఇబ్బందులను పార్టీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన తమకు సీనియర్ నాయకుడని, ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. వారి స్థాయికి తగ్గట్టుగా గౌరవం ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్టు తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన సీనియార్టీ, ఆలోచనలు అవసరమని పేర్కొన్నారు. ఏ సీనియర్ నాయకుడిని కోల్పోయేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పదేండ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు అటు శానససభలో, ఇటు శాసనమండలిలో పార్టీ భావజాలాన్ని భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన జీవన్‌రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ సంపూర్ణంగా గౌరవిస్తది. ఆయన ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటది. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు వారికి ఉన్నటువంటి సీనియార్టీని, ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడ కూడా ఏ సీనియర్ నాయకుడినీ కోల్పోయేందుకు పార్టీ సిద్ధంగా లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే జీవన్‌రెడ్డి లాంటి నాయకులే కారణం. వారు కష్టపడి పోగేస్తేనే రాష్ట్రంలో పాలన చేస్తున్నాం. కాబట్టి ఏ నాయకుడు మనస్తాపానికి గురైనా మేమంతా బాధపడతాం. వారి స్థాయి, సీనియార్టీకి తగ్గట్టుగా, వారి గౌరవానికి భంగం కలగకుండా గౌరవించుకుంటాం.