Deputy CM | మధిర, జూలై 7: భూ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ప్రభుత్వ సాయం కోసం కండ్లలో వత్తులు వేసుకుని చూస్తున్న బాధిత కుటుంబాన్ని ఎట్టకేలకు పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిహారం ప్రకటించకుండా వెనుదిరిగారు.
ఈ నెల 1న ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోగా వారం రోజుల తర్వాత ఆదివారం గ్రామానికి వచ్చిన భట్టి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కంటే ముందే కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తీసుకున్నారు. తమ భూమికి హద్దులు, హక్కులు కల్పించి దారి ఏర్పాటు చేయాలని ప్రభాకర్ తండ్రి కోరారు. కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే వచ్చిన డిప్యూటీ సీఎం ప్రభాకర్ తండ్రి పెద్ద వీరయ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
భట్టిని చూడగానే పెద్ద వీరయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభాకర్ పిల్లలు చిన్నవారని, తాను వృద్ధాప్యంలో ఉన్నానని, పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు. అయితే, భట్టి మాత్రం ఎక్స్‌గ్రేషియా ఊసెత్తలేదు.పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూల్లో చదివించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనకు వైరా సబ్ డివిజన్ ఏసీపీ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నిందితులపై చర్యలు తప్పవు: భట్టి
రైతు ప్రభాకర్ మృతికి కారణమైన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేదిలేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హెచ్చరించారు. ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన రైతు మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. ప్రభాకర్ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు, దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. అందరూ మా వాళ్లే, నా వాళ్లే అని చెప్పి దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
నిందితుడి ఇంటికి భట్టి
ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడైన కూరపాటి కిశోర్ ఇంటికి వెళ్లడం గమనార్హం. అక్కడ పార్టీ నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం తన ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న నిందితుడు కిశోర్ పోలీసుల మధ్య నుంచే దర్జాగా వెళ్లి భట్టిని కలిశారు.
ఫ్లెక్సీ ఏర్పాటు
తండ్రి మరణంతో సర్వం కోల్పోయిన ప్రభాకర్ పిల్లలు ఇంటిముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తున్నది. మందుడబ్బా పట్టుకుని ఏడుస్తున్న తండ్రి, పక్కనే పిల్లలిద్దరూ దండం పెడుతున్నట్టుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై ‘రైతుకు న్యాయం జరగకపోయినా రైతు పిల్లలకైనా జరుగుతుందా? మా భవిష్యత్తుకు న్యాయం చేయండి’ అని ఫ్లెక్సీపై ముద్రించారు.