Runa Mafi | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కథ ఒడిసినట్టేనా? పంట రుణం రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు మాఫీ ఆగిపోయినట్టేనా?.. అంటే శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశాన్ని బట్టి ఇదే అర్థమవుతున్నది. సచివాలయంలో ఆయన మాట్లాడుతుండగా రూ.2 లక్షలకుపైగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారని జర్నలిస్టులు పదే పదే ప్రశ్నించినా, సమాధానం ఇవ్వలేదు. దీనిని బట్టి రుణమాఫీ ఆగిపోయినట్టేనని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. రైతులకు ఇప్పటివరకు రూ.20,617 కోట్ల మేర రుణమాఫీ చేసినట్టు చెప్పారు. మొదటి విడతలో రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేశామని, మిగతావారిలో అర్హులను గుర్తించి రెండో విడతలో పూర్తి చేశామని చెప్పారు. గతంలో బ్యాంకర్లు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పంట రుణాలు రూ.31వేల కోట్లు ఉన్నట్టు భావించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రైతులకు బీమా చేయలేదని, తాము రూ.1514 కోట్లు బీమా కోసం చెల్లించామని చెప్పారు. అయితే.. భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుబీమా పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లోనే ప్రారంభించిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్యవయసున్న రైతులకు బీమా సదుపాయం కల్పించిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొనసాగించిందే తప్ప కొత్త పథకం కాదని స్పష్టం చేస్తున్నారు.
ఎంవోయూ చేసుకుంటే ఇస్తామన్నట్టు కాదు
2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి అదనంగా మరో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని భట్టి చెప్పారు. త్వరలో ఎనర్జీ పాలసీని ఆవిష్కరిస్తామని తెలిపారు. అదానీ ఎనర్జీస్ కంపెనీ రాష్ట్రంలో రూ.5వేల కోట్లతో 1350 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్‌లో జరిగిన ఒప్పందంపై స్పందిస్తూ.. ఎంవోయూలన్నీ.. మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పడానికి మాత్రమే. ఎంవోయూ చేసుకున్నంత మాత్రాన ఇస్తామని ఎక్కడా లేదు. కచ్చితంగా ఇవ్వాలని కాదు. నూతన ఇంధన పాలసీని ఆవిష్కరించిన తర్వాత టెండర్లు పిలుస్తాం. ఎంవోయూ చేసుకున్నవాళ్లయినా టెండర్ల ప్రకారం రావాల్సిందే’ అని స్పష్టం చేశారు. అయితే భట్టి కామెంట్లను నిపుణులు విమర్శిస్తున్నారు. పెట్టుబడులపై చర్చించి, పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే ఎంవోయూ చేసుకుంటారని గుర్తు చేస్తున్నారు. అదానీ ఎంవోయూను పరిగణనలోకి తీసుకోనప్పుడు దావోస్‌లో రూ.40వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేసుకుంటున్నదని ప్రశ్నిస్తున్నారు.
రూ.52,118 కోట్ల అప్పులు తెచ్చాం
ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.52,118 కోట్ల రుణాలు తీసుకున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే సమయంలో అసలు, మిత్తి కలిపి రూ.64,516 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. వీటికి అదనంగా పెట్టుబడి వ్యయం కోసం రూ.24,036 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.61,194 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రైతు భరోసా పథకానికి రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,617 కోట్లు, చేయూత పథకానికి రూ.11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కి రూ.890 కోట్లు, రాయితీ సిలిండర్లకు రూ.442 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.1234 కోట్లు, రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.11,141 కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1514 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.1647 కోట్లు, సాలర్షిప్ డైట్ చార్జీలకు రూ.1016 కోట్లు, ఆర్టీసీకి రూ.1375 కోట్లు, కళ్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ పథకాలకు రూ.2311 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షన్‌దారులకు ఈ ఏడాది మార్చి నుంచి ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. గృ హ జ్యోతి పథకం ద్వారా 49,71, 007 కు టుంబాలు లబ్ధి పొందుతున్నారని, ఇప్పటివరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేసినట్టు తెలిపారు. 2035 నాటికి తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 2025 మే నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు.
30న నూతన టూరిజం పాలసీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతన టూరిజం పాలసీపై శుక్రవారం టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దుబాయ్, సింగపూర్, చైనా దేశాల్లోని టూరిజం పాలసీలను అధ్యయనం చేసి ఈ నెల 30 లోగా కొత్త పాలసీని రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఎండీ ప్రకాశ్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.