Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో గత పాలనను నిందించడానికే ఆర్థికమంత్రి ఎక్కువ సమయం కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి గురువారం మ.12గంటలకు శాసనసభలో 2024 -25 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆయన శాసనసభ, శాసనమండలి స్పీకర్లకు, ముఖ్యమంత్రికి బడ్జెట్ ప్రతులు అందించారు.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి మాటలతో బడ్జెట్ ప్రసం గాన్ని ప్రారంభిం చిన మంత్రి.. గాంధీ, నెల్సన్ మండేలా, నెహ్రూ తదితరుల సూక్తులను ఉటంకించారు. సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
‘ఏదైనా పని జరిగేవరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది’ అన్న నెల్సన్మండేలా వ్యాఖ్యలను ఉటంకిస్తూ..ఈ మాటలు తమ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయ న్నారు. ‘మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను’ అని అంబేద్కర్ చెప్పిన మాటలు ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రభుత్వం 63 లక్షలమంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు.70 పేజీలున్న బడ్జెట్ ప్రసంగం సుమారు రెండు గంటలపాటు సాగింది.ఆయా శాఖల కేటాయిం పులను చెప్తూ, గత ప్రభుత్వం వైఫల్యం చెందితే తాము సరిచేస్తున్నట్టు మంత్రి భట్టి పేర్కొన్నారు. దీంతో ఆయన చెప్తున్న విషయాలు అసత్యాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.
ఒక సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు అరుస్తుంటే, కేసీఆర్ వారివైపు చేయిచూపుతూ వారించారు. చివరగా ‘మనం చేసే పనులకు, చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటినీ పరిష్క రించడానికి సరిపోతుంది’ అన్న మహాత్మాగాంధీ మాటలను ఉటంకిస్తూ, ఈ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కృష్ణభాసర్, హరిత తదితరులు పాల్గొన్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.