కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ చానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని, దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు విభేదం, అగాథం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్రవేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని పదేండ్లు కాంగ్రెస్‌ను బతికించిన తనను కావాలని బద్నాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని భట్టి మథనపడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం.
పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు భట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతుకోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరుప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయ పడ్డట్టు సమాచారం.
ఇదే విషయంపై వారు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని, తొందరపడవద్దని అధిష్ఠానం పెద్దలు సీనియర్లను సముదాయించినట్టు తెలిసింది.
హైదరాబాద్, జనవరి21 (నమస్తే తెలంగాణ): ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా? దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా భట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖమ్మీదే తన ఆవేదనను వెల్లగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? ‘అసలు కాంగ్రెస్’కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? అందుకే మేడారం పర్యటన ఆలస్యమైందా?.. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అంతేకాదు సీఎం తీరును నిరసిస్తూ మేడారంలో భట్టితోపాటు పలువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించుకున్నారని, హైదరాబాద్‌కు వచ్చాక మరోసారి భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఎంతవరకైనా పోరాడాల్సిందే’ అని వారు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నలుగురు సీనియర్ మంత్రులు కలిసి ఈ పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. తాము అన్నీ గమనిస్తున్నామని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఢిల్లీ పెద్దలు సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఆధారాలు సేకరించిన భట్టి
ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి మధ్య అనైతిక బంధం అంటగడుతూ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం రాజకీయ ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. దీనికి ఆంధ్రజ్యోతి పత్రిక మరింత ఆజ్యం పోసింది. సింగరేణి బొగ్గు గనుల వాటా పంపకాల్లో తేడాతోనే కీచులాట మొదలైందంటూ ఆదివారం ‘కొత్త పలుకు’లతో కథనం ప్రచురిచింది. భట్టి విక్రమార్కకు అవినీతిని అంటగడుతూ ఈ కథనం సాగింది. ఎన్టీవీ యాజమాని నరేంద్ర చౌదరితో భట్టికి ఉన్న వ్యాపార సన్నిహిత సంబంధాలతోనే కథనం ప్రసారమైనట్టు రాసుకొచ్చారు. దీంతో భట్టి ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి, కథనాల వెనుక ఎవరున్నారో తేలుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు లోతుగా విచారణ జరుపగా సీఎం రేవంత్ దీని వెనుక ఉన్నట్టు భట్టికి ఆధారాలు లభించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను ప్రజల్లో పలుచన చేయటంతోపాటు రాజకీయంగా పతనం చేయడానికే సీఎం వర్గం ఈ కథనం రాయించినట్టు ఆయన నిర్ధారించుకున్నారని చెప్పుకుంటున్నారు. సింగరేణికి సంబంధించి సీఎంవో దగ్గర ఉన్న ఫైల్లోని కొన్ని పత్రాలను కాపీ చేసి, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి ఇచ్చి నేరుగా ప్రతికాధిపతి ఇంటికి పంపించినట్టు భట్టి నిర్ధారించుకున్నారని, దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారని చెప్తున్నారు.
మార్నింగ్ వాక్‌లో మరోసారి..
ఆదివారం రాత్రి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు మేడారంలోనే బస చేశారు. మరుసటిరోజు తెల్లవారుజామున సీఎం, భట్టి ఇద్దరూ మార్నింగ్ వాక్కు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భట్టి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు సమాచారం. మీతో కలిసి పనిచేయాలని అనిపించడం లేదని నిర్మొహమాటంగా తేల్చిచెప్పినట్టు తెలిసింది. తామంతా ఈ పార్టీని నమ్ముకొని బతికాం, తరతరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నాం, అలాంటి తమను పనికిరానివాళ్లుగా, పరాయివాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తంచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లీకులు ఇస్తూ కథనాలు రాయించడం, దుష్ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం. మేడారం పర్యటన తర్వాత తాను దావోస్ వెళ్తున్నానని, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందామని రేవంత్ సర్దిచెప్పినట్టు తెలిసింది.
పార్టీ కోసం కష్టపడ్డది మనం..
సీఎం వెళ్లిపోయిన తర్వాత భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్‌తో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రేవంత్ వ్యవహారశైలిపైనే ప్రధానంగా వారు చర్చించుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము ఎంతో కష్టపడ్డామని గుర్తు చేసుకున్నారట. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాడానని, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీతో పోరాడానని, పాదయాత్రలు చేశానని, ఏ ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నిలబెట్టానని చెప్పుకొచ్చారట. అలాంటిది ఇప్పుడు తనను ఒక నిందితుడిగా, దోషిగా, అపరాధిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. 20 శాతం కమీషన్లు అంటూ తనను బదనాం చేశారని, అయినా భరించానని, చివరికి కాంట్రాక్టర్లతో సచివాలయంలో ధర్నాలు చేయించారని, తనపై, సహచర మంత్రులపై వారి అనుకూల పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి ఉత్తమ్ సైతం స్పందిస్తూ.. తాను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీసుకోనంటూ శపథం చేసి నెగ్గించుకున్నానని, ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డానని అన్నట్టు తెలిసింది. తమ కష్టాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారని వారిరువురు ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
హైకమాండ్‌కు ఫిర్యాదు
రేవంత్ తీరుపై భట్టితోపాటు సీనియర్ మంత్రులు హైకమాండ్‌కు టెలీకాన్ఫరెన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరూ కలిసి ఒక లేఖ తయారు చేయించారని, ‘అసలు కాంగ్రెస్’ నేతలను దూరం పెడుతున్నారని అందులో పేర్కొన్నారని సమాచారం. అన్నీ గమనిస్తున్నామని, సరైన సమయంలో స్పందిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీ ఎటుపోతున్నది?
భట్టితోపాటు నలుగురు సీనియర్ మంత్రులు మరోసారి హైదరాబాద్‌లో కలుసుకొని, తాజా పరిణామాలపై చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా ‘మనం ఏ కాంగ్రెస్ కోసం పోరాడినం.. ఇవ్వాళ ఆ కాంగ్రెస్ ఎటు పోతున్నది? అసలు కాంగ్రెస్‌వాదులకు ఏమని సమాధానం చెప్తాం అని అంతర్మథనం చెందినట్టు సమాచారం. ‘మన మధ్య విభేదాలను అలుసుగా తీసుకొని ఆయన దూరిపోయాడు. సోనియమ్మ చెప్పిందని పీఠం మీద కూర్చోబెడితే అసలు కాంగ్రెస్‌కు చెందిన ఒక్కొక్కరినీ నరుక్కుంటూ వస్తున్నాడు. ఇవ్వాళ నా పరిస్థితి ఏమిటి? పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఉత్తమ్ కుమార్ పరిస్థితి ఏమిటి? అసలు ఇప్పుడు కాదు జగిత్యాల జీవన్‌రెడ్డిని తప్పించిన రోజునే మనం నిలదీయాల్సింది. ఇంకా ఉపేక్షిస్తే.. వలసవాదులతో అసలుకే ఎసరు వచ్చేటట్టుంది’ అని భట్టి వ్యాఖ్యానించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఖమ్మంలో సీఎం ప్రసంగంపైనా మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని, అలాంటిది ఖమ్మంలో టీడీపీని ఆకాశానికి ఎత్తడాన్ని తీవ్రంగా ఆక్షేపించినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రాభవంలోకి తీసుకురావాలని సీఎం ఎలా చెప్తారని మండిపడ్డారట. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తున్నదని, అలాంటిది బీజేపీ నేతలతో సీఎం రేవంత్ సన్నిహితంగా మెలుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు వినికిడి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఉండి, రాహుల్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి పార్టీలతో సన్నిహితంగా మెలగడం ఏమిటని వారు వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతున్నది. అసలు కాంగ్రెస్‌ను రక్షించుకోవాలని, ఇందుకోసం ఎంతదూరమైనా పోదామని నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాకు అధికారం లేదా?
సీఎం రేవంత్ అన్ని శాఖల్లో చొరబడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. తమతో సంప్రదించకుండానే తమ శాఖలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియామకాలు సైతం సొంతంగా చేసుకుంటున్నారని మండిపడ్డారట. దీంతో తమకు అధికారులు సహకరించడం లేదని మంత్రులు సహచరుల దగ్గర ఆవేదన వ్యక్తంచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము ఇచ్చిన లేఖలకు, తాము చేసిన సిఫారసులను పక్కన పడేస్తున్నారని, ఏపీ నుంచి చెప్పించుకున్నవారికి వెంటనే పనులు అవుతున్నాయని, వెంటనే పోస్టింగ్‌లు వస్తున్నాయని మంత్రులు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని మీడియా సంస్థలు కూడా ఏపీలో టీడీపీకి మద్దతు ఇస్తూ, తెలంగాణలో కేవలం సీఎం రేవంత్ రెడ్డికే మద్దతు ఇస్తున్నాయని, ఇదేం వైఖరి అని ప్రశ్నించుకున్నట్టు సమాచారం.
తనపై కమీషన్ల ముద్ర వేశారని, సచివాలయంలో కాంట్రాక్టర్లతో ధర్నా చేయించి మీడియాలో హైలెట్ చేశారని, ఇప్పుడు ఒప్పందాల పేరుతో తప్పుడు కథనాలు రాయించారని, అసలు తెలుగుదేశంతో అంటకాగే మీడియాతో సంబంధాలు ఉన్నది ఎవరికి అనేది అందరికీ తెలుసని భట్టి ఆవేదన చెందినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో తనపై సివిల్ సైప్లె స్కాం రుద్దారని ఉత్తమ్ ఆవేదన చెందినట్టు తెలిసింది. అసలు మనం ప్రభుత్వంలోనే ఉన్నామా? ఎవరి ప్రభుత్వం ఇది? అని ప్రశ్నించుకున్నట్టు తెలిసింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, ఎలాగైనా సరే ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘నీ పక్కన కూర్చోను’
ఇటీవల అభివృద్ధి పనుల ప్రారంభం, క్యాబినెట్ సమావేశం కోసం సీఎం, మంత్రులు మేడారం తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకోసం బేగంపేట నుంచి సీఎం, డిప్యూటీ సీఎం ఒకే హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉండగా, భట్టి ససేమిరా అన్నట్టు సమాచారం. రేవంత్ తీరుపై ఆగ్రహంతో ఉన్న భట్టి విక్రమార్క.. హెలీప్యాడ్ వద్దే సీఎంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. నీ పక్కన కూర్చొని ప్రయాణం చేయాలంటేనే మనసు అంగీకరించటం లేదని రేవంత్ ముఖమ్మీదే చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రులందరూ కలిసి ప్రయాణం చేసే వాతావరణాన్ని చెడగొట్టారంటూ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ఇతర మంత్రులు కల్పించుకొని, ఎయిర్‌పోర్టులో గొడవపడితే బాగుండదని, క్యాబినెట్ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నదని చెప్తూ భట్టికి సర్దిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. అయినా భట్టి ఒప్పుకోలేదని, చివరికి సహచర మంత్రుల ఒత్తిడితో మెత్తబడ్డారని అంటున్నారు. దీంతో దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా హెలికాప్టర్ బయల్దేరిందని చెప్తున్నారు.