ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి ప్రసార మాధ్యమాల సృష్టేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల మధ్య విభేదాలపై విలేకరులు ప్రశ్నించగా అలాంటివి ఏమీలేవని బదులిచ్చారు. 18న జరిగే బీసీల బంద్‌కు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు చట్టంగా రూపొందకుండా, బీసీలకు రిజర్వేషన్ దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధానమంత్రికి అనేకసార్లు లేఖలు రాశారని, అఖిలపక్షంతో రావడానికి అనుమతిఇవ్వాలని కోరినా, కేంద్రం నుంచి స్పందనలేదని అన్నారు.
దీంతో బీసీ రిజర్వేషన్‌పై బీజేపీకి ఆసక్తిలేదన్న విషయం తేలిపోయిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని అఖిలపక్షం ప్రధానిని కలిసేలా చూడాలని కోరారు. స్థానిక సంస్థలకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆధారంగా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ఈ నెల 24న న్యాయ నిపుణులతో సమావేశం అవుతామని, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చిస్తామని వివరించారు. దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ. 4 వందల కోట్లు బోనస్‌గా చెల్లించామని, సింగరేణి లాభాల బాటలో పయనిస్తున్నదని తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే స్థానిక సంస్థల్లో వారికి 42శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. బీసీల బంద్ బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్నదేనని, ఆ పార్టీ ఇప్పటికైనా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు.