హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): 2014కు ముందు కూడా హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో చెరువులు ఆక్రమణకు గురైనట్టుగా ఆయన పరోక్షంగా అంగీకరించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైడ్రా, మూసీ వివాదంపై స్పందించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ట్రాక్ సెంటర్‌తో కలిసి నగరంలో చెరువులు ఏ విధంగా కబ్జా అయ్యాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో 920 చెరువులు ఉండగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత 225 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని, 196 చెరువులు కొంత వరకు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. మిగిలిన 499 చెరువులు సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. అందుకే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో చెరువులన్నీ కబ్జా అవుతున్నాయని, వీటిని కాపాడుకోకుంటే అందరికీ నష్టమని వివరించారు.
ప్రస్తుతానికి తమ ప్రభుత్వం కేవలం చెరువుల ఎఫ్టీఎల్పైనే దృష్టి పెట్టిందని, ఇంకా బఫర్ జోన్ జోలికి పోవడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ బఫర్ జోన్ జోలికి వెళితే ఇంకా ఎక్కువ కూల్చివేతలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, అంత బడ్జెట్ అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణకు టెండర్లే పిలవలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని, వారికి అక్కడే ఇండ్లు కట్టించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. తమది ప్రజల ప్రభుత్వమని, కూల్చివేతలు ఎవరికీ ఇష్టం ఉండవని అన్నారు. మూసీ ప్రాజెక్టు సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఎజెండా కాదని భట్టి స్పష్టం చేశారు.