ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా.. వెనుక ఎవరుండి రాయించారో త్వరలోనే అన్నీ బయటపెడతా. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో.. ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా.. నీచ, నికృష్టపు, దిగజారుడు రాజకీయాల కోసం కట్టుకథలు సృష్టించి, పుకార్లు షికార్లు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవు.
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో తనపై ఆంధ్రజ్యోతిలో తప్పుడు రాతలు రాశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. రాధాకృష్ణ రాసింది పిట్టకథ.. కట్టుకథ అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలని, ఈ రాతల విషయంలో తాను రాధాకృష్ణతోనే తేల్చుకుంటానని ఘాటువ్యాఖ్యలు చేశారు. వెనుకాల ఎవరుండి రాయించారో త్వరలోనే బయటపెడతానని స్పష్టంచేశారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారంపై నిప్పులు చెరిగారు. ‘కథనంలో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు. ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు రాయడమేంది?’ అని ప్రశ్నించారు. ‘మీకు, ఇతర మీడియా సంస్థలకు ఏం వైరముందో తెలియదు. మీ మధ్యలోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు. ఏ చానల్ అయినా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయవద్దు. రాధాకృష్ణ లాగా ఏది పడితే అది రాయలేను. మాట్లాడలేను. ఎక్కడ చూసి.. ఎక్కడ కూర్చొని రాశాడో తేలుస్తా’ అని హెచ్చరించారు.
వైఎస్ సన్నిహితుడిని అయినందునే..
తాను 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని భట్టి విక్రమార్క చెప్పారు. చట్టసభలు, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో రాధాకృష్ణకు నచ్చక వైఎస్‌పై కోపంతో తనపై ఈ రాతలు రాసినట్టుగా కనిపిస్తున్నదని ఆరోపించారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో, అధికార హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రత్యేక లక్ష్యం కోసం వచ్చానని చెప్పారు. తాను బాధ్యతల్లో ఉన్నంత కాలం తెలంగాణ ఆస్తులపైకి ఏ గద్దలనూ రానివ్వనని చెప్పారు.
భయపెట్టాలని చూస్తే ఊరుకోం
‘నీచ నికృష్టపు, దిగజారుడు రాజకీయాల కోసం కట్టుకథలు సృష్టించి, షికార్లు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవు’ అని భట్టి ఫైర్ అయ్యారు. చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తాను ఆత్మగౌరవంతో బతుకుతున్నానని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు.
నైనీ టెండర్లు రద్దు..
టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందని చెప్పారు. గనులు క్లిష్ట ప్రాంతాల్లో ఉంటాయని, ఫీల్డ్ విజిట్ అనే నిబంధన పెడతారని, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ ఈ నిబంధన ఉన్నదని తెలిపారు. ‘ఇష్టం వచ్చినట్టు రాయడం కాదు. ముందుగా తెలుసుకోవాలి’ అని చురకలంటించారు. ఆరోపణలతో టెండర్లు రద్దు చేయాలని సూచించినట్టు తెలిపారు.