హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునర్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, సిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున రాబోతున్నాయని చెప్పారు. ఆ కోణంలో బ్యాంకర్లు ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని, సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు.
2024 వానాకాలం సీజన్లో 54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు (81.57 శాతం) విడుదల చేశారని వెల్లడించారు. యాసంగి రుణాల పంపిణీకి నెలరోజుల సమయమే ఉన్నదని, వేగం పెంచాలని కోరారు. టర్మ్ లోన్స్ విషయంలో లక్ష్యానికి మించి పని చేయడం అభినందనీయం ప్రశంసించారు. ఆయిల్ పామ్ సాగు విషయంలోనూ బ్యాంకర్లు లిబరల్గా ఉండాలని సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాల కోసం, రైతులకు రుణమాఫీ, ఇతర పథకాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని భట్టి తెలిపారు. కాబట్టి పెద్ద సంఖ్యలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిపై మంగళవారం రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హిమాయత్‌నగర్‌లోని గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, గ్రౌండింగ్ తదితర అంశాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించనున్నారు.